IND vs AUS: మళ్లీ అదే తడబాటు.. టీమిండియా 185 పరుగులకు ఆలౌట్

వేదికలు మారుతున్నా.. ఓటములు ఎదురవుతున్నా.. భారత బ్యాటర్ల ఆటలో ఎటువంటి మార్పు ఉండట్లేదు. చేసిన పొరపాట్లను మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నారు. కెప్టెన్‌పై వేటు పడితే.. ఇతర ఆటగాళ్లలో మార్పుస్తుందేమో అంటే అదీ లేదు. మెల్‌బోర్న్‌ టెస్టును ఆటను మరోసారి గుర్తుచేశారు. సిడ్నీ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో185 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. రిషబ్ పంత్(40).. టాప్ స్కోరర్. 

చుక్కలు చూపించిన పేసర్లు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లకు ఆసీస్ పేసర్లు చుక్కలు చూపించారు. ఖచ్చితమైన లైన్ యాడ్ లెంగ్త్, పదునైన పేస్‌తో టాపార్డర్‌‌ను బెంబేలెత్తించారు. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (4), జైస్వాల్‌(10) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శుభమాన్ గిల్(20), విరాట్ కోహ్లి(17)లది అదే తడబాటు. సరిగ్గా ఒక్క బంతి ఆడితే లంచ్‌ బ్రేక్‌ అన్న సమయంలో గిల్ ఔటయ్యాడు. 

Also Read :- రోహిత్‌ను తప్పించారు.. నిజం ఒప్పుకోండి

అనంతరం లంచ్‌ విరామం తరువాత ఆచితూచి ఆడుతున్న విరాట్‌ కోహ్లీని బోలాండ్‌ బోల్తా కొట్టించాడు. దాంతో, టీమిండియా 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో రిషభ్‌ పంత్‌ (40) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లు శరీరానికి బంతులేస్తూ ఇబ్బంది పెడుతున్నా.. ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఒళ్లంతా కుళ్లబొడచారంటే నమ్మాలి. గాయాలు నల్లగా కమిలిపోయాయి. చివరకు వారి దెబ్బలు తాళలేక అతనూ వెనుదిరిగాడు. ఆ మరుసటి బంతికే గత మ్యాచ్ సెంచరీ హీరో  నితీష్ రెడ్డి(0) ఔటవ్వడం టీమిండియాను మరింత దెబ్బతీసింది. 

చివరలో రవీంద్ర జడేజా(26), వాషింగ్టన్ సుందర్(14), కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(22) విలువైన పరుగులు చేసి స్కోరు బోర్డును 170 పరుగులు దాటించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కడం అంటే గగనమే అని చెప్పుకోవాలి.