AUS vs IND: ముగిసిన రెండో రోజు ఆట.. రసవత్తరంగా సిడ్నీ టెస్ట్

సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఆఖరి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దాంతో, ఆధిక్యం 145 పరుగులకు చేరింది. క్రీజులో రవీంద్ర జడేజా (8 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (6 నాటౌట్) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఇరు జట్లకు సమంగా ఉన్నాయి.

జైస్వాల్ దూకుడు

తొలి ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడిన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. స్టార్క్ వేసిన మొదటి ఓవర్‌లోనే జైస్వాల్ నాలుగు బౌండరీలు రాబట్టాడు. దాంతో, భారత డగౌట్‌లో కాస్త జోష్ కనిపించింది. ఆ సయమంలో టీమిండియా శిబిరంలో బోలాండ్‌ అలజడి రేపాడు. 5 పరుగుల స్వల్ప వ్యవధిలో ఓపెన‌ర్లు ఇద్దరిని పెవిలియన్ చేర్చాడు. తొలుత రాహుల్‌, ఆ త‌ర్వాత జైస్వాల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆపై కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ(6),శుబ్‌మన్ గిల్(13)లు వారి వెంటే పెవిలియన్ చేరారు. దాంతో, టీమిండియా 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

పంత్ మెరుపులు

కష్టాల్లో ఉన్న టీమిండియాను రిష‌బ్ పంత్‌ గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. వీలైనంత వ‌ర‌కు వేగంగా స్కోర్ చేయాల‌న్న ఉద్దేశంతో పంత్ బ్యాటింగ్ చేస్తున్న‌ట్లు క‌నిపించాడు. 28 బంతుల్లోనే 50 మార్కును చేరుకున్న పంత్.. 61 ప‌రుగుల స్కోర్ వ‌ద్ద కమ్మిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తరువాత నితీశ్‌ (4)ను బోలాండ్ ఔట్ చేశాడు. చివరలో మరికొద్ది సేపట్లో ఆట ముగుస్తుందనగా జడేజా క్యాచ్‌ను స్మిత్ నేలపాలు చేయడం టీమిండియాను సంతోషపెట్టే అంశం.