వేటు కాదు విశ్రాంతి.. తుది జట్టులో రోహిత్‌‌‌‌ లేకపోవడంపై బుమ్రా

సిడ్నీ: ఊహించినట్టుగానే ఆస్ట్రేలియాతో  ఐదో టెస్టు తుది జట్టులో రోహిత్‌‌‌‌ శర్మకు స్థానం దక్కలేదు. మ్యాచ్‌‌‌‌కు ముందు బీసీసీఐ రిలీజ్‌‌‌‌ చేసిన 16 మందితో కూడిన టీమ్ షీట్‌‌‌‌లోనూ రోహిత్‌‌‌‌ పేరు లేదు. దాంతో  కోచ్‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌ అతనిపై వేటు వేశాడని, హిట్‌‌‌‌మ్యాన్ టెస్టు కెరీర్‌‌‌‌‌‌‌‌ ముగిసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, రోహిత్‌‌‌‌ గైర్హాజరీలో కెప్టెన్‌‌‌‌గా టాస్‌‌‌‌కు వచ్చిన బుమ్రా హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌పై వేటు వేయలేదని.. తనంతట తానుగా విశ్రాంతి తీసుకున్నాడని చెప్పాడు. 

‘ఈ మ్యాచ్‌‌‌‌కు విశ్రాంతి తీసుకొని మా కెప్టెన్‌‌‌‌  తన నాయకత్వ స్ఫూర్తిని చూపెట్టాడు. ఇది మా జట్టులో ఐక్యతను తెలియజేస్తుంది. మాలో ఎవరికీ ఎలాంటి స్వార్థం లేదు. జట్టుకు ఏది మంచిది అయితే మేము అదే చేయాలని చూస్తున్నాం’ అని బుమ్రా పేర్కొన్నాడు.  తుది జట్టులో రోహిత్ లేకపోవడం భావోద్వేగ సందర్భమని పంత్ అన్నాడు. ‘రోహిత్‌‌‌‌ మా నాయకుడు. ఇది మా టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ తీసుకున్న నిర్ణయం. దీనిలో రోహిత్‌‌‌‌ కూడా భాగమే. ఈ సంభాషణల్లో నేను లేను కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’ అని తెలిపాడు.

ఈ సిరీస్‌‌‌‌లో తీవ్రంగా నిరాశ పరిచిన రోహిత్ గతేడాది ఆడిన 14 మ్యాచ్‌‌‌‌ల్లో 24.76 సగటుతో 619 రన్స్ మాత్రమే చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో  రోహిత్ ను తిరిగి టెస్టు జట్టులో చూడలేమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో వచ్చే నెలలో పాకిస్తాన్‌‌‌‌ ఆతిథ్యం ఇచ్చే చాంపియన్స్ ట్రోఫీ తర్వాత హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెబుతాడన్న వార్తలు వస్తున్నాయి.