జస్ప్రీత్ బుమ్రా vs ఆస్ట్రేలియాగా సాగుతున్న బాక్సింగ్ డే టెస్టుకు ప్రేక్షకులు పోటెత్తారు. ఆఖరి రోజు ఆట కావడం.. గెలిచే అవకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉండటంతో సోమవారం (డిసెంబర్ 30) ఒక్కరోజే 66వేలకు పైగా ప్రేక్షకులు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు తరలివచ్చారు. దాంతో మెల్‌బోర్న్ టెస్ట్‌కు హాజరైన మొత్తం ప్రేక్షకుల సంఖ్య 3,50,000 దాటింది. తద్వారా నాలుగో టెస్ట్ కొత్త రికార్డులు సృష్టించింది.
మెల్‌బోర్న్ టెస్ట్‌కు మొత్తం 3,50,700 మంది హాజరైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా నివేదించింది. ఈ సంఖ్యతో నాలుగో టెస్ట్.. 87 ఏళ్ల క్రితం నమోదైన ఓ రికార్డును తుడిచి పెట్టేసింది. 1937లో మెల్‌బోర్న్ (MCG) వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టుకు 3లక్షల 50వేల 534 మంది హాజరైనట్లు లెక్కలున్నాయి. ఆ రికార్డును ప్రస్తుతం భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు టెస్ట్ అధిగమించింది.
Insane Day 5 crowd at the MCG. ? pic.twitter.com/XhRC16jAVi
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2024
ఆసక్తి పెంచిన కోహ్లీ -కొంటాస్ గొడవ..
మెల్‌బోర్న్ టెస్టు ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడానికి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ యువ ఆటగాడు సామ్ కొంటాస్ మధ్య జరిగిన గొడవే కారణమన్న మాటలు వినపడుతున్నాయి. ఈ గొడవ జరిగిన మరుసటి ఆసీస్ మీడియాలో వచ్చిన కథనాలూ ఆసీస్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయని చెప్పుకోవాలి. 'కోహ్లీని విదూషకుడి'గా చూపిస్తూ ది వెస్టర్న్ ఆస్ట్రేలియా పత్రిక ప్రచురించిన కథనాలను కొందరు అభిమానులు ఆఖరి రోజు మైదానంలో ప్రదర్శించారు.