IND vs AUS: బుమ్రాకు గాయం.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు

టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడినట్లు తెలుస్తోంది. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆట మధ్యలో బుమ్రా మైదానాన్ని వీడటమే అందుకు కారణం. జట్టు మెడికల్‌ సిబ్బందితో కలిసి స్కానింగ్‌కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ఎక్స్(X) ఖాతాలో పంచుకుంది. బహుశా.. అతడు ఈ మ్యాచ్‌లో మళ్లీ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 32 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. తొలిరోజు ఆటలో నంబర్ 10 బ్యాటర్‌గా 17 బంతుల్లో 22 పరుగులు చేశాడు. రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో విరాట్ కోహ్లీ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

4 పరుగుల స్వల్ప ఆధిక్యం

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు నిలబెట్టారు. ప్రసిద్ కృష్ణ(3), సిరాజ్(3), బుమ్రా(2), నితీష్ రెడ్డి(2) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 పరుగులకే కుప్పకూలింది. దాంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.  

అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 40 పరుగులతో రిషభ్ పంత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరలో రవీంద్ర జడేజా(26), వాషింగ్టన్ సుందర్(14), కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(22) విలువైన పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2 వికెట్లు పడగొట్టారు.