IND vs AUS 2nd Test: ట్రావిస్ హెడ్ భారీ శతకం.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 157 పరుగుల ఆధిక్యం

అడిలైడ్ వేదికగా భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొలుత టీమిండియాను 180 పరుగులకే కట్టడి చేసిన ఆసీస్.. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో 157 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ట్రావిస్ హెడ్(140) భారీ సెంచరీ చేయగా.. మార్నస్ లబుషేన్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది.

Also Read :- సిరాజ్,హెడ్‌ల మధ్య గొడవ

రెండో రోజు ఆటలోట్రావిస్ హెడ్‌దే పైచేయి. ఎడా పెడా బౌండరీలు బాదుతూ తన హోం గ్రౌండ్ అడిలైడ్‌లో సెంచ‌రీ న‌మోదు చేశాడు. 141 బంతుల్లో 17 ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌ సాయంతో 140 పరుగులు చేశాడు. హోం గ్రౌండ్‌లో హెడ్‌కు ఇది మూడ‌వ టెస్టు సెంచ‌రీ. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ ద్యయం నాలుగేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్, నితీష్ రెడ్డి చెరొక వికెట్ తీసుకున్నారు.

టీమిండియా 180 ఆలౌట్

అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు భారత స్టార్ బ్యాటర్లందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. స్టార్క్ 48 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. నితీష్ రెడ్డి (42), కేఎల్ రాహుల్ (37), గిల్ (31) పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు రాణించకుంటే ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన పుంజుకోవడం కష్టమే.