రైతు సంఘాలతో అసంపూర్తిగా ముగిసిన చర్చలు

రైతు సంఘాలతో అసంపూర్తిగా ముగిసిన చర్చలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ చట్టాలు, పంటకు గిట్టుబాటు ధరపై నిర్ణయం ఫైనల్ కావడం లేదు. రైతుల సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం సోమవారం విజ్ఞాన్ భవన్ లో జరిపిన ఏడో విడత చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్స్‌ను ఏమాత్రం తలొగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దీక్షలు విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఆ క్రమంలో ఈనెల 8న మరోసారి చర్చలకు రావాలని కేంద్రం పిలుపునిచ్చింది. చట్టాల రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తాము చెప్పినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. రేపు(మంగళవారం) సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై  చర్చిస్తామని తెలిపారు.