శభాష్ పోలీస్‌‌‌‌.. ఇన్సిడెంట్‌‌‌‌, యాక్సిడెంట్‌‌‌‌ ఫ్రీగా న్యూ ఇయర్​ వేడుకలు

  • డిసెంబర్​ 31 రోజు రాత్రి గట్టి బందోబస్తు
  • అడుగడుగునా చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌లు.. డ్రంకెన్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ తనిఖీలు
  • పబ్బులు, ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు, రిసార్ట్‌‌‌‌లపై స్పెషల్​ ఫోకస్​
  • గంజాయి, డ్రగ్స్‌‌‌‌ కట్టడికి స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ 
  • ఈవెంట్స్‌‌‌‌లో షీ టీమ్స్‌‌‌‌ నిఘా..
  • జీహెచ్ఎంసీలో 2,864 డ్రంకెన్‌‌‌‌ డ్రైవ్ కేసులు 

 హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా  పోలీసులు పకడ్బందీగా విధులు నిర్వర్తించారు. వారి ముందస్తు ప్రణాళికలతో రోడ్డు ప్రమాదాలు సహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో ‘‘2025 ​ యాక్సిడెంట్​, ఇన్సిడెంట్‌‌ ఫ్రీ” ఇయర్‌‌‌‌గా నిలిచింది. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య సిటిజన్లు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.   డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ చెకింగ్‌‌, డ్రగ్స్‌‌, గంజాయి సప్లయ్‌‌తోపాటు ర్యాష్‌‌  డ్రైవింగ్‌‌పై పోలీసులు స్పెషల్‌‌ ఫోకస్ పెట్టారు. శివారు ప్రాంతాల్లోని ఫామ్‌‌హౌస్‌‌లు, రిసార్ట్స్‌‌పై ప్రత్యేక నిఘా ఉంచారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచే ఇన్సిడెంట్‌‌ ఫ్రీ ఆపరేషన్‌‌ ప్రారంభించారు. 

బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు అప్రమత్తంగా వ్యవహరించారు. దాదాపు 4,500 మంది పోలీసులు డిసెంబర్‌‌‌‌ 31 డ్యూటీ చేశారు. డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌, డ్రగ్‌‌ డిటెక్షన్‌‌ కిట్స్‌‌తో తనిఖీలు నిర్వహించారు. స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ కోసం స్టాటిక్, మొబైల్, స్పీడ్ కంట్రోల్ టీమ్స్‌‌ను ఏర్పాటు చేశారు. వెహికల్ మూవ్ మెంట్స్ ఎక్కువగా ఉండే పబ్స్, హోటల్స్‌‌ రూట్లలో స్టాటిక్ టీమ్స్‌‌తో చెక్ పాయింట్స్ పెట్టారు.  డ్రంకెన్ డ్రైవ్ ఎక్కువగా జరిగే ఏరియాల్లో మొబైల్ టీమ్స్‌‌తో రోమింగ్ నిర్వహించారు. దీంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదు. ఈ ఏడాది మొదటి రోజే ‘‘ఇన్సిడెంట్‌‌, యాక్సిడెంట్ ఫ్రీ డే’’ గా జనవరి1 పోలీసుల రికార్డ్స్‌‌లోకి ఎక్కింది.  

ఎక్కడికక్కడ కట్టడి.. 

ప్రధానంగా బంజారాహిల్స్‌‌, జూబ్లీహిల్స్‌‌, పంజాగుట్ట, హైటెక్‌‌సిటీ, మాదాపూర్‌‌‌‌పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ర్యాష్‌‌  డ్రైవింగ్‌‌ను నివారించేందుకు సిటీ రోడ్లపై బారికేడ్లు పెట్టారు. ఓఆర్‌‌ఆర్‌‌, పీవీ ఎక్స్‌‌ప్రెస్‌‌వే పైకి హెవీ వెహికల్స్‌‌ మినహా కార్లను అనుమతించలేదు. సిటీ కమిషనరేట్ పరిధి హుస్సేన్‌‌సాగర్‌‌‌‌పరిసర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు స్పీడ్‌‌ కంట్రోల్‌‌ టీమ్స్‌‌ను ఏర్పాటు చేశారు. 

బంజారాహిల్స్‌‌, జూబ్లీహిల్స్ సహా మొత్తం 66 లొకేషన్స్‌‌లో డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ చెకింగ్‌‌ పాయింట్స్ నిర్వహించారు.172 జంక్షన్స్‌‌వద్ద పాయింట్‌‌డ్యూటీ కానిస్టేబుల్స్‌‌ను నియమించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే 57 హాట్‌‌స్పాట్స్‌‌లో జిగ్‌‌జాగ్‌‌ బారికేడ్స్‌‌ ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో హై స్పీడ్‌‌ డ్రైవ్‌‌ చేయకుండా నివారించారు. మొత్తం 30 ఫ్లై ఓవర్స్‌‌పై స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా వాహనాలను అనుమతించారు. ఫ్లై ఓవర్స్‌‌ ఎంట్రీ, ఎగ్జిట్స్‌‌ వద్ద డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ చెకింగ్‌‌చేశారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని ఓఆర్‌‌ఆర్‌‌‌‌, పీవీ ఎక్స్‌‌ప్రెస్‌‌వేపై ఆంక్షలు విధించారు. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ ప్రయాణికుల ‌‌టికెట్స్‌‌ చెకింగ్​తోపాటు కారు డ్రైవ్‌‌చేస్తున్న వ్యక్తికి బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేసిన తర్వాతే అనుమతించారు.

ర్యాష్  డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్​కు చెక్.. 

ఈవెంట్స్‌‌ కోసం పోలీసులు ప్రత్యేక గైడ్‌‌లైన్స్‌‌ రూపొందించారు. పోలీసుల నిబంధనలు పాటించిన వారికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సెక్యూరిటీపై పబ్స్, స్టార్ హోటల్స్, ఈవెంట్స్ నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈవెంట్స్‌‌లో షీ టీమ్స్ తో నిఘా పెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌‌ను ఎప్పటికప్పుడు పరిశీలించేలా సిబ్బందిని అలర్ట్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రంకెన్ డ్రైవ్ చెక్ పాయింట్స్ నిర్వహించారు. 

ప్రమాదాలకు అవకాశాలు ఉన్న హాట్‌‌స్పాట్స్‌‌ వద్ద బారికేడ్స్‌‌ ఏర్పాటు చేశారు. దాదాపు 550 బ్రీత్‌‌ ఎనలైజర్స్‌‌తో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. 3 కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2,864 డ్రంకెన్‌‌ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మద్యం మత్తులో ఉన్న వారి వెహికల్స్‌‌ను సీజ్ చేశారు. శివారు ప్రాంతాల్లోని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్‌‌‌‌పార్క్ సహా నెక్లెస్ రోడ్స్, ట్యాంక్‌‌బండ్ పరిసర  ప్రాంతాల్లో ప్రత్యేక చెకింగ్‌‌ చేశారు. దీంతోపాటు డ్రంకెన్ డ్రైవ్ కండిషన్‌‌లో సిటీలో ర్యాష్  డ్రైవింగ్ చేసే మందుబాబులకు మొబైల్ టీమ్స్‌‌తో చెక్ పెట్టారు. 

తప్పులు కనిపెట్టేలా బాడీవార్న్‌‌ కెమెరాలు..

సాధారణంగా డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌ చెకింగ్‌‌తోపాటు న్యూ ఇయర్‌‌‌‌ సెలబ్రేషన్స్‌‌లో ట్రాఫిక్‌‌ను కంట్రోల్‌‌ చేసే సమయాల్లో పోలీసులు, వాహనదారుల మధ్య వాగ్వాదం జరుగుతుంటుంది. ఇలాంటి ఘటనలు గతంలో వివాదాస్పదమయ్యాయి.  అలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. చెకింగ్‌‌ సమయంలో బాడీ వార్న్‌‌ కెమెరాలను వినియోగించారు. 

గ్రేటర్‌‌‌‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల యూనిట్స్‌‌లో వీటిని యూజ్​ చేశారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లలో 480 బాడీవార్న్‌‌ కెమెరాలను ఆపరేట్‌‌ చేశారు. కంట్రోల్‌‌ రూమ్‌‌లోని సర్వర్లకు వాటిని కనెక్ట్‌‌ చేశారు. వాహనాదారులతో మాట్లాడే సమయంలో ఈ కెమెరాలు ఆన్‌‌లో ఉంటాయి. దీంతో పోలీసులు, వాహనదారుల ప్రవర్తనను వీడియో రికార్డింగ్‌‌ ద్వారా గుర్తించే అవకాశాలున్నాయి. బాడీవార్న్‌‌ కెమెరాలో రికార్డ్‌‌ అయిన ఆడియో, వీడియోలను డిలీట్‌‌ చేసే అవకాశం లేదు. దీంతో ఎవరు తప్పు చేసినా వీటిని సాక్ష్యాలుగా ప్రవేశపెట్టవచ్చు.

ప్రశాంతంగా  న్యూ ఇయర్ ​సెలబ్రేషన్స్​

న్యూ ఇయర్‌‌‌‌ సెలబ్రేషన్స్‌‌లో పాల్గొన్న యూత్ అందరి సహకారంతో డిసెంబర్ 31 వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. నగరంలోని 66 ప్రాంతాల్లో  డ్రంకెన్  డ్రైవ్‌‌ చెకింగ్‌‌ నిర్వహించాం. 1,406 కేసులు నమోదు చేశాం. ర్యాష్  డ్రైవింగ్‌‌ చేసే వారిని నివారించాం. పీఎస్‌‌లో రైటర్‌‌‌‌ దగ్గరినుంచి  డీసీపీ స్థాయి అధికారి వరకు ఆన్‌‌ డ్యూటీలో ఉన్నాం. దీంతో ఎలాంటి ప్రమాదాలు కానీ.. అవాంఛనీయ ఘటనలుగానీ చోటు చేసుకోలేదు. జీరో యాక్సిడెంట్‌‌కు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ కొత్త సంవత్సరంలో కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నా.
- విశ్వప్రసాద్‌‌, అడిషనల్ సీపీ, 
ట్రాఫిక్‌‌, హైదరాబాద్‌‌