జనవరి13 నుంచి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు

  • సీఎంను ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, వెలుగు: హన్మకొండ జిల్లా ఐనవోలులో ఈ నెల13 నుంచి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు రావాలని మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో దేవాదాయశాఖ తరపున ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, సిబ్బంది.. సీఎంకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించి, శేష వస్త్రాలతో సత్కరించారు. వేదాశీర్వచనాలు అందించారు.  

ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాల వైభవాన్ని, దేవాలయ చారిత్రక నేపథ్యాన్ని, ఆలయ ప్రాశస్త్యాన్ని సీఎంకు వివరించారు. అంతకు ముందు వర్ధన్న పేట ఎమ్మెల్యే నాగరాజు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు, అర్చకులు మంత్రి కొండా సురేఖను జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ సిబ్బంది మంత్రికి మల్లికార్జున స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.

శాలువాతో సత్కరించారు. అనంతరం జాతర ఏర్పాట్లను ఆలయ ఈవో మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు..