బోటు షికారు మూన్నాళ్ల ముచ్చటే!

  • గ్రాండ్​గా ఓపెన్ చేసి మూలకు వేసేశారు    
  • గతంలో జమ్ములమ్మ రిజర్వాయర్ .. ఇప్పుడు సంగాల రిజర్వాయర్

గద్వాల, వెలుగు: గద్వాలలోని సంగాల రిజర్వాయర్ లో బోటింగ్ సౌకర్యం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. రిజర్వాయర్​లో ఏడాది అంతా నీళ్లుంటాయని.. నీళ్లున్నన్ని రోజులూ బోటింగ్​ ఉంటుందని బోట్లను ప్రారంభిస్తూ అప్పటి మంత్రి శ్రీనివాసగౌడ్​ చెప్పారు. కానీ ప్రస్తుతం అక్కడ బోట్లు మూలన పడ్డాయి. జాలీగా గడుపుదామని సంగాల పార్కుకు వెళ్లిన ప్రజలు, చిన్నారులు బోటింగ్​లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. గతంలో జములమ్మ రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన బోట్లు కూడా నిర్వహణ లోపంతో 
నిలిచిపోయాయి. 

లక్షలు వృథా

2019 అక్టోబర్​లో సంగాల రిజర్వాయర్ లో అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గ్రాండ్ గా బోట్​ షికారు ప్రారంభించారు. కొన్ని రోజులకే బోట్లు మూలకు పడగా.. ఆ తర్వాత మళ్లీ ప్రారంభించారు. నిర్వహణ లోపాలతో తిరిగి బంద్​అయ్యింది. అంతకుముందు జమ్ములమ్మ గుడికి వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం జమ్ములమ్మ రిజర్వాయర్​లో ఒక డీలక్స్ బోట్ తో పాటు, రెండు పెడల్స్ బోట్లు ఏర్పాటు చేశారు. వాటిని సరిగా మెయింటెన్​చేయకపోవడంతో పనికిరాకుండా పోయాయి. 

సంగాల రిజర్వాయర్ దగ్గర రూ. 25 లక్షలతో పెద్ద బోట్, రూ. 16 లక్షలతో రెండు చిన్న బోట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి కూడా రిపేరుకొచ్చాయి. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలన్న ఉద్దేశంతో జములమ్మ రిజర్వాయర్, సంగాల పార్క్ దగ్గర బోటింగ్ ఏర్పాటు చేశారు. అవి పనిరాకుండా పోవడంతో ప్రజలు అటువైపు వెళ్లడమే మానేశారు. 

అధ్వాన్నంగా సంగాల పార్క్

మెయింటెనెన్స్ లేకపోవడంతో సంగాల పార్క్ అధ్వానంగా తయారైంది. మొదట్లో పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు, ఆటలు ఆడుకోవడానికి సామగ్రిని ఏర్పాటు చేశారు. శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఐ లవ్ గద్వాల సింబల్ ఏర్పాటు చేసి భారీ జాతీయ జెండాను ఎగరేశారు. తొలుత మున్సిపల్​ అధికారులు పార్క్​ను బాగానే మెయింటెన్​ చేసినా క్రమంగా నిర్లక్ష్యం పెరిగి పార్క్​ అధ్వాన్నంగా మారింది, దాంతో పార్క్​కు సందర్శకుల రాక 
తగ్గిపోయింది.

బోటింగ్ ప్రారంభిస్తాం

 సంగాల రిజర్వాయర్ దగ్గర బోటింగ్ నిలిచిన మాట వాస్తవమే. జములమ్మ రిజర్వాయర్ దగ్గర అప్పుడప్పుడు బోట్లు నడుపుతున్నాం. సంగాల రిజర్వాయర్ దగ్గర కూడా బోట్​ షికారును మళ్లీ ప్రారంభిస్తాం. - రాజు , బోటింగ్ ఇంచార్జ్