ఇయ్యాల్టి నుంచి మళ్లీ రైతుల నిరసన

ఇయ్యాల్టి నుంచి మళ్లీ రైతుల నిరసన

న్యూఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు ఉధృతం చేసేందుకు రైతులు డిసైడ్ అయ్యా రు. బుధవారం ఉదయం 11 గంటల కల్లా ఢిల్లీలో ఉంటామని ప్రకటించారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించొద్దని హెచ్చరించారు. శాంతియుతంగా పార్లమెంట్ ముందు నిరసన తెలియజేస్తామన్నారు. రైతు సంఘాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ బార్డర్ల వద్ద మంగళవారం పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. ఐదేండ్ల కాంట్రాక్ట్​తో పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని సహకార సంస్థలు కనీస మద్దతు ధరకు కొంటాయని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రపోజల్​ను రైతులు తిరస్కరించారు. అన్ని పంటలకు ఎంఎస్​పీ ప్రకటించి చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం జరిపిన చర్చలు విఫలం కావడంతో బుధవారం నుంచి ఆందోళనలు ఉధృతం చేసేందుకు రైతు సంఘాలు నిర్ణయించాయి. శంభు బార్డర్ వద్ద రైతులు ఐరన్ షీల్డ్స్, జూట్ బ్యాగులు సిద్ధం చేసుకున్నారు. టియర్ గ్యాస్ నుంచి తమను తాము కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.