History of India : రహస్యంగా జాయిన్​ ఇండియా ఉద్యమం

జాయిన్​ ఇండియా ఉద్యమం బహిర్గతంగా, అజ్ఞాతంగా కొనసాగింది. హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​లోని సీనియర్​ నాయకులు గాంధీ సిద్ధాంతాల ఆధారంగా బహిర్గత ఉద్యమం నడపగా, యువకులైన కాంగ్రెస్​ నాయకులు క్విట్​ ఇండియా ఉద్యమ(రహస్య) పద్ధతిలో నడపాలని నిర్ణయించారు. 

1947, మేలో హైదరాబాద్​ రాష్ట్ర కాంగ్రెస్​ బహిరంగ సమావేశం హైదరాబాద్​లోని కర్బాలా మైదానంలో జరిగింది. ఈ సమావేశంలోనే జాయిన్​ ఇండియా(భారతదేశంలో విలీనం కావాలని) ఉద్యమం ప్రారంభించాలని తీర్మానించారు. 

ఇదే సమయంలో 1947, మే 7న సోషలిస్టు పార్టీ కార్యదర్శి జయప్రకాశ్​ నారాయణ హైదరాబాద్​ను సందర్శించారు. మే 8న కర్బాలా మైదానంలో జరిగిన సమావేశంలో జాయిన్​ ఇండియా ఉద్యమానికి మద్దతు పలికారు. ఇండియన్​ యూనియన్​లో చేరేటట్లు నిజాం ప్రభుత్వంపై ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చాడు. ఈ సమాచారం తెలుసుకున్న నిజాం ప్రభుత్వం జయప్రకాశ్​​ నారాయణను రాజ్యం నుంచి బహిష్కరించింది. 

హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ బూర్గుల రామకృష్ణారావునేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. జయప్రకాశ్​ నారాయణ రాజ్య బహిష్కరణ ఉత్తర్వులను ఖండిస్తూ జాయిన్​ ఇండియా ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమాన్ని గాంధీ సత్యాగ్రహ సిద్ధాంతం ప్రకారం బహిరంగంగా నిర్వహించారు. 

ఏహెచ్​ఎస్​యూ విద్యార్థుల సమ్మె 

1947, జులై 31న జాయిన్​ ఇండియా యూనియన్​ డే జరపాలని ఆల్​ హైదరాబాద్​ స్టూడెంట్​ యూనియన్​(ఏహెచ్​ఎస్​యూ) పిలుపునిచ్చింది. ఈ మేరకు విద్యార్థులు భారీ ఊరేగింపుగా సుల్తాన్​బజార్​లోని హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ కార్యాలయం వద్ద స్వామి రామానందతీర్థ కలిసి జాయిన్​ ఇండియా ఉద్యమం ప్రారంభించాలని కోరారు. 1947, ఆగస్టు 7న హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ నిజాం ప్రభుత్వాన్ని ఇండియన్​ యూనియన్​లో  చేరాలని పిలుపు ఇచ్చింది. 

ఈ రోజునే స్వామి రామానందతీర్థ నిజాం సంస్థానం విలీనం కోసం సత్యాగ్రహం ప్రారంభించారు. దీంతో నిజాం ప్రభుత్వం స్వామి రామానందతీర్థ, బూర్గుల రామృష్ణారావుతోపాటు మిగతా నాయకులను అరెస్టు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం దగ్గర పడేకొద్దీ నగరంలో ఉద్రిక్తత పెరిగింది. జాతీయ జెండాను ఎగురవేసి భారత స్వాతంత్ర్య దినోత్సవం పాటించాలని హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నిజాం, రజాకార్లు వ్యతిరేకించారు. 

1947, ఆగస్టు 13న స్వాతంత్ర్యం ప్రకటించుకుంటూ నిజాం ప్రభుత్వం ఒక ఫర్మానాను జారీ చేసింది. రాజ్యంలో భారత జాతీయ పతాకాలను ఎగురవేయకుండా నిషేధం విధించింది.  ఈ నిషేధాన్ని ఉల్లంఘించి 1947, ఆగస్టు 15న ఒకరిపై మరొకరు పోటీపడి ప్రజలు జాతీయ జెండాను ఎగురవేశారు. జవహర్​లాల్​ నెహ్రూ స్వయంగా తనకు అందజేసిన త్రివర్ణ పతాకాన్ని మోతీలాల్​ మంత్రి సుల్తాన్​బజార్​లో ఎగురవేశారు. 

ఆగస్టు 15న హైదరాబాద్​లో కర్ఫ్యూ విధించినా విమలాబాయ్ మేల్కోటే, జ్ఞానకుమారి హెడా, అహల్యాభాయ్​, బ్రిజ్​రాణి గౌర్​, యశోద బహెన్​ తదితర మహిళలు హైదరాబాద్​లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 

హెచ్​ఎస్​సీ జాతీయ జెండా దినోత్సవం 

1947, సెప్టెంబర్​ 2న జెండా దినోత్సవం జరపాలని హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ పిలుపునిచ్చింది. దీంతో రాజ్యంలోని పలు పట్టణాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పరకాల గ్రామంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించారు. ఇదే రోజున వరంగల్​లో కాళోజీ నారాయణరావు, మధిరలో జమలాపురం కేశవరావు జెండా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 

భాగ్యనగర్ రేడియో కార్యకలాపాలు

ఇది ఒక అజ్ఞాత రేడియో.హైదరాబాద్​ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పాగ పుల్లారెడ్డి హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ ప్రచార ఉద్యమాల కోసం ముంబయి నుంచి తెచ్చిన పరికరాలతో భాగ్యనగర్​ రేడియో ద్వారా కార్యక్రమాలు నిర్వహించారు. 

ఈ  రేడియో ప్రసారాలు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్​ భాషల్లో జరిగేవి. తెలుగులో రామకృష్ణశర్మ, ఉర్దూలో టి.నాగప్ప ఆధ్వర్యంలో వెలువడేవి. నిజాం ప్రభుత్వం, రజాకార్ల దురాగతాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి భాగ్యనగర్​ రేడియో కార్యక్రమాలు దోహదపడ్డాయి. ఈ కార్యక్రమాలను నిజాం నిషేధించినా రహస్యంగా నిర్వహించారు.


ఉద్యమ శిబిరాలు

బల్లార్ష శిబిరం: ఈ శిబిరాన్ని ఆదిలాబాద్​ జిల్లా కాంగ్రెస్​ కమిటీ కార్యదర్శి కేవీ కేశవులు నెలకొల్పారు. హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ ఉద్యమ నిర్వాహక మండలి ఆదేశానుసారం హుజూరాబాద్​కు చెందినవి.రాజేశ్వరరావు ఈ శిబిరాన్ని పునర్వ్యవస్థీకరించారు. చందానగర్​లో కె.వి.నర్సింగరావు ఈ శిబిరాన్ని స్థాపించగా, ఇందులో బల్లార్షా శిబిరం విలీనమైంది. 

దాభా శిబిరం: ఈ శిబిరాన్ని బల్లార్షాశిబిరానికి ఉపశిబిరంగా ఏర్పాటు చేశారు. ఇన్​చార్జి సి.వామన్​రావు.

సిరివంచ శిబిరం: కరీంనగర్ జిల్లాలోని మంథని తాలూకా సరిహద్దులో నెలకొల్పారు. పర్యవేక్షకులు జి.శ్రీరాములు.

మోర్దండి శిబిరం: మధ్యప్రదేశ్​లోని యావత్​ మహాల్​ జిల్లాలోని మోర్దండి గ్రామంలో నెలకొల్పారు. దీనికి ఎం.గంగారెడ్డి నాయకత్వం వహించారు. 

మురళి శిబిరం: ఇది మోర్దండి శిబిరానికి ఉపశిబిరం. ఇది గంగారెడ్డి నేతృత్వంలో నడిచింది. 

రేపాల శిబిరం: ఈ శిబిరం ఇన్​చార్జి కోదాటి నారాయణరావు. నల్లగొండ జిల్లాలోని మునగాల, లింగగరి పరిగణాలు ద్వీపాలుగా ఉండేవి. వీటి చుట్టూ నిజాం ప్రాంతానికి చెందిన గ్రామాలు ఉండేవి.  రేపాల శిబిరాన్ని విస్తరించి నేలమర్రి, సింగవరం, కొక్కిరేణి, సిరిపురం గ్రామాల్లో కూడా శిబిరాలను ఏర్పాటు చేశారు.

నారాయణరావ్​ పవార్​ 

ఆర్య సమాజం సభ్యుడైన నారాయణరావు పవార్, జగదీష్​ ఆర్య, గండయ్య ఆర్య అనే స్నేహితులతో కలిసి 1947, డిసెంబర్​ 4న కింగ్​కోఠి ప్యాలెస్ వద్ద ఏడో నిజాం మీర్ ఉస్మాన్​ అలీఖాన్​పై బాంబుదాడి చేశారు. ఈ దాడిలో మీర్​ ఉస్మాన్ అలీఖాన్​ తప్పించుకున్నాడు. నిజాం ప్రభుత్వం నారాయణరావు పవార్​కు మరణశిక్ష విధించింది. కానీ, 1948, సెప్టెంబర్​ 17న మరణశిక్షను జీవిత కారాగార శిక్షగా మార్పు చేశారు.

అజ్ఞాత ఉద్యమం

హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాన్ని అనుసరించి జాయిన్​ ఇండియా ఉద్యమం నిర్వహించారు. అయితే, హెచ్​ఎస్​సీ నాయకులు మితవాదులకు భిన్నంగా 1942లో జరిగిన క్విట్​ ఇండియా ఉద్యమ(రహస్య) పద్ధతిలో నడపాలని నిర్ణయించారు. వీరు రాజ్యంలో మూడు భాషా ప్రాంతాలకు 3 ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పరిచారు. హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​పై నిషేధం ఉండటం  వల్ల తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. విజయవాడ శిబిరం, మన్మాడ్​ శిబిరం (షోలాపూర్​), ఆదిలాబాద్​ శిబిరం (చందానగర్​) ప్రాంతీయ కార్యాలయ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు బొంబాయిలో ఒక కేంద్ర కార్యాలయం స్థాపించారు. వి.బి.రాజు, టి.హయగ్రీవాచారి, బొమ్మకంటి సత్యనారాయణలకు విజయవాడలోని తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం నడిపే బాధ్యతలను అప్పగించారు. ఈ ఉద్యమాన్ని నిర్వహించి ఉద్యమ ఆశయాలను ప్రచారం చేసేందుకు పరిటాల, ఆదిలాబాద్​, నెల్లమర్రి, కొక్కిరేని, చందా, షోలాపూర్, మన్మాడ్​ ప్రాంతాల్లో సరిహద్దు శిబిరాలను ఏర్పాటు చేశారు.

పరిటాల శిబిరాన్ని కోదాటి నారాయణరావు పర్యవేక్షించగా, ఆదిలాబాద్​, చందా, షోలాపూర్​ శిబిరాలను పి.వి.నరసింహారావు, కేవీ నరసింగరావు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతీయ కార్యాలయానికి ఏపీ కాంగ్రెస్​ సహాయ సహకారాలు అందించింది. జాయిన్​ ఇండియా ఉద్యమం తక్కువ కాలంలోనే ప్రజా ఉద్యమంగా పరిణమించింది.  ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి ఎదురైన సవాలును ఎదుర్కొనేందుకు  ​హిందువుల్లో భయభ్రాంతులను సృష్టించమని రజాకార్లను ప్రోత్సహించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని హిందువులను బలవంతంగా ఇస్లాంలో చేర్పించి, రాష్ట్రం వెలుపల ఉన్న ముస్లింలను రాష్ట్రంలో స్థిరపడేందుకు ఆహ్వానించమని ప్రోత్సహించాడు.