విద్యా శాఖలో..ఆఫీసర్లంతా ఇన్​చార్జీలే..

  •     ఏండ్లుగా డీఈవోతో పాటు ఎంఈవో పోస్టులు ఖాళీ
  •     టెన్త్  రిజల్ట్స్​లో జోగులాంబ జిల్లాకు రాష్ట్రంలో 32వ ప్లేస్
  •     స్కూళ్లపై పర్యవేక్షణ కరువుతో ఫలితాలపై ప్రభావం

గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యా శాఖలో ముఖ్యమైన ఆఫీసర్​ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. డీఈవో పోస్ట్​తో పాటు ఎంఈవో పోస్టులు ఇన్​చార్జీలతో నెట్టుకురావడంతో టీచర్లు, స్కూళ్లపై పర్యవేక్షణ కొరవడింది. గత ఏడాది ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాకు 27వ స్థానం రాగా, ఈ సారి 32వ స్థానానికి దిగజారింది. జిల్లాలో 12 మండలాలకు గాను, ఐదుగురే ఎంఈవోలు ఉన్నారు. ఇందులో ఇద్దరు నాలుగేసి మండలాలకు ఎంఈవోలుగా పని చేస్తున్నారు.

భర్తీ కాని పోస్టులు..

కొంతకాలంగా గద్వాల డీఈవో పోస్ట్  ఖాళీగా ఉంది. డీఈవోగా డైట్  లెక్చరర్  సిరాజుద్దీన్ ను ప్రభుత్వం ఇన్​చార్జిగా నియమించింది. ఆయన వ్యక్తిగత కారణాలతో 6 నెలల కింద లీవ్ లో వెళ్లారు. ఎస్సెస్సీ ఎగ్జామ్స్​ సమయంలో అడిషనల్  కలెక్టర్  అపూర్వ్  చౌహాన్ 20 రోజుల పాటు ఇన్​చార్జి డీఈవోగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆఫీస్ లోని డీవో ఇందిరకు డీఈవో(ఎఫ్ఏసీ)గా బాధ్యతలు ఇచ్చారు. అప్పటినుంచి ఆమె ఇన్​చార్జి డీఈవోగా కొనసాగుతున్నారు.

12 మండలాలకు గాను ఐదుగురు ఎంఈవోలు ఉన్నారు. ఇందులో సురేశ్ కు కేటి దొడ్డి, ధరూరు, గద్వాల, మల్దకల్  మండలాల ఎంఈవోగా కొనసాగుతున్నారు. నర్సింలు రాజోలి, వడ్డేపల్లి, అయిజ, గట్టు ఎంఈవోగా ఉన్నారు. ఒక ఎంఈవో 4 మండలాలను ఎలా పర్యవేక్షిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర స్థాయిలో 32వ స్థానం.

టెన్త్​ రిజల్ట్స్​లో జోగులాంబ గద్వాల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 32వ స్థానం దక్కింది. జిల్లాలో 7,175 మంది ఎగ్జామ్స్​ రాస్తే, 5,839 మంది (81.38 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 3,512 బాలురులో 2,763(78.67 శాతం) , 3,663 బాలికల్లో 3,076(83.97 శాతం) ఉత్తీర్ణత సాధించారు. రెగ్యులర్​ డీఈవో,  ఎంఈవోలు లేకపోవడంతో స్కూళ్లపై పర్యవేక్షణ కరువైంది. దీంతో స్కూళ్ల పనితీరు, విద్యా ప్రమాణాలు గాడి తప్పాయని అంటున్నారు. 

ఆర్జేడీ ఆదేశాలు భేఖాతార్..

డీఈవో ఆఫీస్ లో ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆర్జేడీ ఆదేశాలను భేఖాతార్  చేశారనే విమర్శలున్నాయి. మే మొదటి వారంలో గట్టు మండలానికి సురేశ్, మల్దకల్ కు నర్సింలును ఎంఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వులను కాదని మల్దకల్ కు సురేశ్ ను, గట్టుకు నర్సింలు ఎంఈవోలుగా నియమించారనే ఆరోపణలున్నాయి.

వనపర్తిలోనూ అదే పరిస్థితి..

వనపర్తి : వనపర్తి జిల్లాకు రెగ్యులర్​ డీఈవో, ఎంఈవోలు లేరు. జిల్లాలో 554 స్కూల్స్​ ఉండగా, 55,915 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఎస్సెస్సీ ఫలితాల్లో 78.21శాతం మంది పాస్​ అయ్యారు. ఇదిలాఉంటే 14 మండలాలకు గాను పాన్​గల్​కు మాత్రమే రెగ్యులర్​ ఎంఈవో ఉన్నారు.  

మిగిలిన మండలాలకు ఇన్​చార్జీ ఎంఈవోలు కొనసాగుతున్నారు. ఒక్కో ఎంఈవోకు రెండు, మూడు మండలాల చొప్పున ఇచ్చారు. ఇన్​చార్జి డీఈవోగా నాగర్​కర్నూల్​ డీఈవో కొనసాగుతున్నారు. దీంతో గవర్నమెంట్​ స్కూళ్లపై పర్యవేక్షణ కొరవడుతోంది.