కరోనా వాక్సినేషన్​లో..ఇండియా వరల్డ్​ రికార్డ్

కరోనా వాక్సినేషన్​లో..ఇండియా వరల్డ్​ రికార్డ్
మొదటి రోజే 2,07,229 మందికి టీకా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్​లకన్నా మన దగ్గరే ఎక్కువ కేంద్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ వెల్లడి రెండో రోజు ఆరు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కొత్తగా 17,072 మందికి టీకా.. న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్​లో ఇండియా వరల్డ్​లోనే టాప్​ ప్లేస్​లో నిలిచిందని.. ఒక్క మొదటిరోజునే ప్రపంచంలోనే ఎక్కువగా 2 లక్షల ఏడు వేల 229 మందికి వ్యాక్సిన్​ వేశామని కేంద్ర హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది. ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్​ మొదలైన బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్​దేశాల్లో తొలిరోజున వేసిన వ్యాక్సిన్ల కంటే మన దేశంలో ఎక్కువ మందికి ఇచ్చామని తెలిపింది. కేంద్ర హెల్త్​ మినిస్ట్రీ  అడిషనల్​ సెక్రటరీ మనోహర్​ అగ్నానీ ఈ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రెండో రోజు వ్యాక్సినేషన్​ కొనసాగిందని తెలిపారు. ఆదివారం ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు రాష్ట్రాల్లోని 553 సెంటర్లలో 17,072 మందికి తొలి డోసు ఇచ్చినట్టు వెల్లడించారు. రెండు రోజుల్లో కలిపి మొత్తంగా.. 2 లక్షల 24 వేల 301 మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయినట్టు తెలిపారు.రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ క్లాష్​ కాకుండా కొన్ని రాష్ట్రాల్లోనే వ్యాక్సినేషన్ చేపట్టినట్లు వివరించారు. వారంలో నాలుగు రోజులు రాష్ట్రాలు, యూటీల్లో ఇతర రొటీన్ హెల్త్ సర్వీసులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వారంలో నాలుగు రోజులు వ్యాక్సిన్ వేసేలా ప్లాన్ రూపొందించుకోవాలని మనోహర్ అగ్నాని సూచించారు. చాలా రాష్ట్రాలు వారానికి నాలుగు రోజులు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. గోవా, యూపీ వారానికి రెండు రోజుల చొప్పున, మిజోరం వారంలో ఐదు రోజుల చొప్పున, ఏపీ ఆరు రోజుల చొప్పున టీకాలు వేయాలని నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో సమీక్ష నిర్వహించామని, వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో ఇబ్బందులు, సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. 447 మందికి కొంచెం సీరియస్ వ్యాక్సినేషన్ సందర్భంగా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వెంటనే ట్రీట్ మెంట్ చేయడానికి సంబంధించిన ప్రొటోకాల్స్ అమల్లో ఉన్నాయని మనోహర్  అగ్నానీ తెలిపారు. దేశవ్యాప్తంగా కొందరికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయన్నారు. ఇంజక్షన్ చేసిన చోట వాపు, నొప్పి, వాంతులు, అలర్జిక్ రియాక్షన్ల వంటివి కామన్ గా ఉంటాయని తెలిపారు. రెండు లక్షల మందిలో.. 447 మందికి కాస్త ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, వీరిలో ముగ్గురినే దవాఖానాలో జాయిన్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఇద్దరు ట్రీట్ మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని, మరొకరు రిషికేశ్ ఎయిమ్స్ లో అబ్జర్వేషన్ లో ఉన్నారన్నారు.