దుబాయ్ నుంచి 47 సార్లు లాగిన్ అయ్యారు

దుబాయ్ నుంచి 47 సార్లు లాగిన్ అయ్యారు
  • మొయిత్రా పార్లమెంట్ ఐడీ లాగిన్ వివరాలు బయటకు
  • ఆ సమయంలో టీఎంసీ ఎంపీ ఇండియాలోనే ఉందన్న నిపుణులు
  • ఇయ్యాల ఎథిక్స్ కమిటీ ముందుకు మహువా మొయిత్రా

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆమె పార్లమెంటరీ అకౌంట్ ను దుబాయ్ నుంచి వినియోగించినట్టు, దాదాపు 47 సార్లు అక్కడి నుంచే లాగిన్ అయినట్టు మీడియా రిపోర్టులు వెల్లడించాయి. దీనిపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందిస్తూ.. ‘‘దుబాయ్ లోని హీరానందానీ ప్లేస్ నుంచి 47 సార్లు మహువా మొయిత్రా అకౌంట్ లాగిన్ అయినట్టు, ఆమె పార్లమెంట్ లో చాలా ప్రశ్నలు అడిగినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇదే నిజమైతే, దేశంలోని ఎంపీలందరూ మహువా అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలి. వ్యాపారవేత్తల స్వార్థ ప్రయోజనాల కోసం మనం ఎంపీలుగా పని చేస్తున్నామా?” అని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్​ చేశారు. కాగా, అదానీ గ్రూప్ లక్ష్యంగా ప్రశ్నలు అడిగేందుకు మహువాకు బిజినెస్ మెన్ హీరానందానీ లంచం ఇచ్చారని నిషికాంత్ దూబే ఆరోపించారు. దీనిపై లోక్ సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. మహువా గురువారం కమిటీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, లాగిన్ వివరాలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

కమిటీకి ఆ అధికారం ఎక్కడిది? 

నేరారోపణలపై విచారించే అధికారం లోక్ సభ ఎథిక్స్ కమిటీకి లేదని మహువా మొయిత్రా అన్నారు. బుధవారం ఆమె కమిటీ చైర్ పర్సన్ వినోద్ కుమార్ సోంకర్ కు లేఖ రాశారు. దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘‘నాకు ఇచ్చిన సమన్లను మీడియాకు విడుదల చేయడం సరైందేనని కమిటీ భావించింది. కమిటీ ముందు విచారణకు హాజరయ్యే ముందు ఈ లెటర్ విడుదల చేయడం సరైందేనని నేను భావిస్తున్నాను. నాపై మోపిన ఆరోపణలన్నీ అసత్యాలని నిరూపిస్తాను” అని ఆమె పేర్కొన్నారు.

తాను లంచం తీసుకున్నానని ఆరోపిస్తూ అఫిడవిట్ ఇచ్చిన  హీరానందానీని ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అసలు హీరానందానీ ఇచ్చిన ఆధారాలేంటో అందజేయాలని డిమాండ్ చేశారు. కాగా, యాపిల్ ఫోన్ల హ్యాకింగ్ అంశంపై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు మహువా లెటర్ రాశారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు.