భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడిస్తుంటే.. ఇతర రాష్ట్రాలు వర్షాల అలర్ట్ ను ఎదుర్కొంటున్నాయి. పలు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. కేరళ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కొచ్చిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, ఎర్నాకులం, ఇడుక్కి, కొచ్చి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని IMD హెచ్చరించింది. ఆరు జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ఆరెంజ్ అలర్ట్ కిందకు వస్తుందని నివేదిక వెల్లడించింది.
ఆయా జిల్లాల్లో ఆదివారం ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. వర్షసూచన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. వరద సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. కొండచరియలు, విరిగిపడే ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వరద నీటిని తోడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాకపోకలు సాగించకపోవడం మంచిదని అధికారులు సూచించారు.
పర్యాటకులు ఎక్కడున్నా..అక్కడనే ఉండాలన్నారు. కొండల ప్రాంతాలకు వెళ్లవద్దని డిజాస్టర్ మేనేజ్ మెంట్ సూచించింది. ఈసారి రుతుపవనాలు ముందుగానే వస్తాయని.. ఇప్పటికే IMD అంచనా వేసిన సంగతి తెలిసిందే. మే 15వ తేదీ కల్లా.. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతం.. దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఆ తర్వాత 15 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయని వెల్లడించింది.
మరిన్ని వార్తల కోసం :
అవినీతి చేస్తున్నారని తెలిసినా ఎందుకు అరెస్టు చేయరు?
ఎండకు తల్లడిల్లిన ఢిల్లీ.. 49.2 డిగ్రీలు
