ఇండస్ట్రియల్ జోన్లో అక్రమ వెంచర్లు!..పర్మిషన్ల కోసం రూ.3 కోట్లు వసూలు

  • బై నంబర్లతో ఫేక్​ రిజిస్ట్రేషన్లు చేసిన ఆఫీసర్లు
  • ప్లాట్లు కొని నష్టపోతున్న సామాన్యులు

గద్వాల, వెలుగు : ఇండస్ట్రియల్ జోన్ లో జోరుగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. వీటి కోసం పర్మిషన్లు తీసుకొస్తామని చెప్పి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వెంచర్లలో ప్లాట్లు కొన్న సామాన్యులు నష్టపోతున్నారు. అక్రమ వెంచర్లను అరికట్టాల్సిన టౌన్  ప్లానింగ్  ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

ఇండస్ట్రియల్  జోన్ లోని సర్వే నంబర్లకు బై నంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని, ఎల్పీలు లేకున్నా ఉన్నట్లు ఫేక్  డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అక్రమార్కులకు కొందరు కౌన్సిలర్లు, లీడర్లు సపోర్ట్  చేస్తుండగా, మున్సిపల్, రిజిస్ట్రేషన్​ శాఖలోని కొందరు ఆఫీసర్లు ముడుపులు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారనే విమర్శలున్నాయి.

100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్..

గద్వాల పట్టణంలోని అయిజ రోడ్, పాలకేంద్రం, హాస్పిటల్  వెనక ఉన్న ప్రాంతాన్ని ఇండస్ట్రియల్  జోన్ గా 1985లో గద్వాల టౌన్ ప్లానింగ్ లో గుర్తించారు. సర్వే నంబర్  5,16తో పాటు 670 నుంచి 690, 693 నుంచి 713తో పాటు మరికొన్ని సర్వే నెంబర్లను ఈ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఇండ్లు కట్టుకోవడం, వెంచర్లు వేయడం చేయవద్దు. ఒకవేళ వెంచర్లు వేసి ఇండ్లు కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్  తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ, ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇప్పటికే 40 ఎకరాల్లో  వెంచర్లు వేసి ప్లాట్లుగా మార్చారు. ఇండస్ట్రియల్ జోన్ లోని సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్  అయ్యే అవకాశం లేకపోవడంతో.. వాటికి బై నంబర్లు ఇచ్చి మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్  ఆఫీసర్లు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలున్నాయి.

ఫేక్ ఎల్పీలతో బురిడీ..

ఇండస్ట్రీయల్  జోన్ లోని సర్వే నంబర్లకు ఎల్పీ రాదు. కానీ, బై నంబర్లు వేసి ఇతరులకు వాటిని రిజిస్ట్రేషన్  చేసి ఫేక్  ఎల్పీలతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే కొందరు అక్రమార్కులు చేనుగొనిపల్లి గ్రామపంచాయతీలో స్థలాలు ఉన్నట్లు చూపించి, వాటిని ఇతరుల పేర్లపై మార్చి ఫేక్  ఎల్పీలు తీసుకొచ్చి సామాన్యులకు అంటగడుతున్నారని అంటున్నారు. 

రిక్రియేషన్​ జోన్ లోనూ వెంచర్లు..

నది అగ్రహారం రోడ్​కు వెళ్లే మార్గం దగ్గర సబ్​స్టేషన్  వెనక ఉన్న 489,173,480,488తో పాటు మరికొన్ని సర్వే నంబర్లలోని 85 ఎకరాలను 1985లో మున్సిపాలిటీ టౌన్  ప్లానింగ్ లో రిక్రియేషన్​ జోన్ గా గుర్తించారు. 485/ఏ,489,490,489,494 సర్వే నంబర్లలో అక్రమంగా వెంచర్లు వేసి అమ్మకానికి పెట్టారు.

పర్మిషన్ల పేరుతో వసూళ్లు..

ఇండస్ట్రియల్, రిక్రియేషన్  జోన్లలో పర్మిషన్లు తీసుకొస్తామని చెప్పి కొందరు అక్రమార్కులు, రియల్ ఎస్టేట్  వ్యాపారులు, కొందరు కౌన్సిలర్లు దాదాపు రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ రియల్టర్​ తన రెండెకరాల స్థలాన్ని నాలుగున్నర కోట్లకు అమ్మి, రిక్రియేషన్  జోన్  నుంచి తొలగించేలా పర్మిషన్  తీసుకొస్తానని చెప్పి మాట తప్పడంతో ఇటీవల పెద్ద గొడవ జరిగింది. అతను అమ్మిన ప్లాట్లు రిజిస్ట్రేషన్  కాకపోవటంతో, బాధితులు ఆయనను నిలదీయడంతో ఈ వ్యవహారం గద్వాల పట్టణంలో రచ్చగా మారింది.

ఇక ఇండస్ట్రియల్  జోన్ లో ప్లాట్లు కొన్నవారి నుంచి దళారులు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తూ ఫేక్​ సర్టిఫికెట్లు అంటగడుతున్నారు. ఇలా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఫేక్​ పర్మిషన్లు ఇప్పించి దళారులు, టౌన్  ప్లానింగ్, రిజిస్ట్రేషన్  ఆఫీసర్లు అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఫేక్  టీ-పాస్  పర్మిషన్లు తీసుకున్న వారు భవిష్యత్​లో ఇబ్బంది పడే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులే అంటున్నారు.

ఫేక్​ పర్మిషన్లపై దృష్టి పెడతాం..

ఇండస్ట్రియల్  జోన్ లో వెంచర్లకు పర్మిషన్  ఇస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. ఆన్ లైన్ లో పర్మిషన్లు ఇవ్వడంతో సమస్యగా మారింది. టౌన్  ప్లానింగ్  ఆఫీసర్లతో చర్చించి పర్మిషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ జోన్లలో పర్మిషన్లను రద్దు చేస్తాం.

- దశరథం, మున్సిపల్  కమిషనర్, గద్వాల