రేషన్​ బియ్యం అక్రమార్కుల ఆస్తులు వంద కోట్లకుపైనే..

  • పీడీఎస్ అక్రమ రవాణా నిందితుల విచారణలో బయటపడుతున్న నిజాలు  
  • పోలీస్ స్టేషన్లలో సెటిల్ మెంట్లు, మాట వినని వాళ్లపై కేసులు   
  •  రేషన్ బియ్యం అక్రమార్కులను అరెస్ట్ చేయడంతో వెలుగులోకి వాస్తవాలు 

సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్రమ రేషన్ రవాణా అక్రమార్కుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 ఏండ్లలో పోలీసులతో కలిసి అక్రమార్కులు అనేక సెటిల్ మెంట్లతో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. ఇందులో పీడీఎస్ అక్రమ రవాణా మాత్రమే కాకుండా భూ తగాదాలు, సెటిల్ మెంట్లు, గంజాయి, కరోనా సమయంలో రెమ్​డిసివిర్​ ఇంజక్షన్ల బ్లాక్ దందా అంతా ఈ నలుగురు అక్రమార్కుల కనుసైగలోనే జరిగినట్లు తేలింది. అంతేకాకుండా పోలీసుల సహకారం సైతం ఉండడంతో రేషన్ బియ్యం సరఫరా చేసే సమయంలో జిల్లాలోని సరిహద్దు మండలాల పోలీస్ స్టేషన్ కు ముందస్తుగా సమాచారం అందించి లారీలను అడ్డుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా మాట వినకపోతే అక్రమ కేసులు నమోదు చేయించి తమ దారికి తెచ్చుకున్నారు. 

పోలీసుల ఎస్కార్ట్​తో బయటకు..

జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల సపోర్టు ఉండడంతో పోలీసులు వీళ్లు చెప్పినట్లే చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. పెన్ పహాడ్ మండలంలో ఏకంగా ఫంక్షన్ హాల్ కేంద్రంగా అనేక సెటిల్ మెంట్లు నిర్వహించేవారని సమాచారం. అయితే ఫిర్యాదులు వస్తుండడంతో పోలీస్ స్టేషన్లనే అడ్డాలుగా చేసుకొని అనేక సెటిల్ మెంట్లు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల సహకారం ఉండడంతో పోలీస్ వెహికిల్స్ ఎస్కార్ట్​గా పెట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి. 

Also Read :- అబ్దుల్లాపూర్​‌‌‌‌మెట్లో అధికారులపై దౌర్జన్యం..

గతంలో పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర సమయంలో శంకర్ కుటుంబ సభ్యులతో దేవాలయానికి వస్తే ఏకంగా పోలీసులు ఎస్కార్ట్​ పెట్టి మరి తీసుకెళ్లి స్వామివారి దర్శనం కల్పించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా భిక్షపతితో కలిసి శంకర్ హాస్పిటల్స్​కు సంబంధించిన అనేక సెటిల్ మెంట్లు పోలీస్ స్టేషన్ లో జరిగాయి. జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అబార్షన్​ జరిగి ఓ మహిళ మరణించగా డాక్టర్ పై కేసు కాకుండా ఈ ముఠానే సెటిల్ మెంట్ చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 వీళ్లను కాదని ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని బార్డర్ తరలించే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టించే ప్రయత్నం చేసేవారు. గతంలో కోదాడలో పీడీఎస్ బియ్యం వీరిని కాదని కాకినాడ పోర్టుకు తరలించగా, పోలీసులు అక్కడికి వెళ్లి రెండు లారీలను వెనక్కి తీసుకొచ్చి నిందితులను అరెస్ట్ చేయడం గమనార్హం.   

ఎంక్వైరీలో ఉన్నతాధికారుల పేర్లు..

తాజాగా నలుగురు ఆక్రమార్కులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో పలువురు ఉన్నతాధికారుల పేర్లు బయట పెట్టినట్లు సమాచారం. గతంలో ఎవరెవరూ వీరికి అండగా ఉన్నారు..? రేషన్ బియ్యం బార్డర్​కు ఎలా తరలించారు..? ఎవరికి ఎంత ముడుపులు అందాయి..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

అయితే కాకినాడ పోర్టు వ్యవహారంలో జగ్గయ్యపేటకు చెందిన పీడీఎస్ బియ్యం వ్యాపారిని అక్కడి సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి పోలీస్ అధికారులు ఇచ్చిన సమాచారంతోనే ఈ మూఠాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదని ఐజీ సత్యనారాయణ తెలిపారు.