అసైన్డ్ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు

  • మూడు లక్షల క్యూబిక్  మీటర్ల మట్టి తరలింపు
  • కోటిన్నర ఆదాయానికి గండి
  • ప్రైవేటు యూనివర్సీటీ నిర్వాకం
  • చోద్యం చూస్తున్న అధికారులు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: కొంతమంది అక్రమార్కులు అసైన్డ్​భూముల్లో యథేచ్ఛగా  తవ్వకాలు జరిపి మట్టి తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు, రాయల్టీలు చెల్లించకుండానే మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని పక్కదారి పట్టించారు. సమీపంలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీ యాజమాన్యం మట్టి కోసం జేసీబీలతో అసైన్డ్ భూముల్లో తవ్వకాలు సాగించడంతో ముప్పయి  అడుగుల మేర పెద్ద గొయ్యి ఏర్పడింది.

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం శివారులో  ఓ ప్రైవేట్ వ్యవసాయ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ యూనివర్సీటీ  పనుల కోసం మర్కుక్ మండలం దామరకుంట గ్రామ శివారులోని అసైన్డ్ భూముల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొడుతున్నారు. దామరకుంటలోని సర్వే నంబర్ 30 లో ఉన్న భూములను పలువురు రైతులకు అసైన్డ్ చేశారు. వ్యవసాయానికి కేటాయించిన భూమి నుంచి  రెవెన్యూ నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీ ఎత్తున మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు.

కోట్లలో ఆదాయానికి గండి

ప్రైవేట్​అగ్రికల్చర్​యూనివర్సిటీకి ఇప్పటికే 30 వేల టిప్పర్ల ద్వారా మూడు లక్షల క్యూబీక్ మీటర్ల మట్టిని తరలించారు. అక్రమంగా తరలించిన మట్టికి సంబంధించి  రాయల్టీగా ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు కోటిన్నర రూపాయలకు అక్రమార్కులు గండికొట్టారని ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. భూగర్భ గనుల శాఖకు ఎలాంటి రాయల్టీ,  సీనరేజీ చెల్లించకుండానే  తవ్వకాలు జరిపి మట్టిని తరలిస్తుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడింది.

జేసీబీలతో బహిరంగంగా తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది. అక్రమ మట్టి తవ్వకాల గురించి పలువురు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే 30 అడుగుల లోతు గోతి ఏర్పడిందంటే ఎంత మొత్తంలో మట్టిని తరలించారో అర్థంమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నియంత్రించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మట్టి తవ్వకాలపై చర్యలు 

రైతుల జీవనాధారం కోసం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో మట్టి తవ్వకాలు జరపడం నిబంధనలకు విరుద్ధం. దామరకుంట వద్ద అసైన్డ్  భూముల్లో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దామరకుంట వద్ద మట్టి తవ్వకాలపై విచారణ జరిపి తగిన  చర్యలు తీసుకుంటాం. 
 


- బన్సీలాల్,  ఆర్డీవో, గజ్వేల్