స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉన్నా లేనట్టే!

  •     అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు 2021లో  ఏర్పాటు
  •     ఇన్​చార్జీలుగా జోనల్​కమిషనర్లు​ 
  •      ఏడాదికి వెయ్యి ఫిర్యాదులు వస్తున్నా నోటీసులతోనే సరి 
  •      ఆమ్యామ్యాలకు అలవాటు పడి సైలెన్స్​
  •     గృహ ప్రవేశం చేసేవరకు చోద్యం చూస్తున్న అధికారులు 

హైదరాబాద్ సిటీ, వెలుగు : బల్దియాలో అక్రమ నిర్మాణాల కట్టడికి ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు పని ఉండడం లేదు. 2021లో జోనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పని చేయకపోవడంతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. కనీస అనుమతులు కూడా తీసుకోకుండా బిల్డింగులు కడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నా యాక్షన్​తీసుకోవడం లేదు. ప్రతి సోమవారం బల్దియా హెడ్​ఆఫీసుతో పాటు జోనల్​ఆఫీసుల్లో నిర్వహించే ప్రజావాణికి అక్రమ నిర్మాణాలపై 20 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయి. ఏడాదిలో వెయ్యి వరకు కంప్లయింట్స్​వస్తున్నా నామ్ కే వాస్తేగా విచారణ జరుపుతున్న అధికారులు..కొన్నింటికి మాత్రమే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.  

సీజ్​చేస్తలేరు..కూలుస్తలేరు

గ్రేటర్​లో అనధికార నిర్మాణాలు, లే అవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవడానికి గత ఏడాది బల్దియా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. జోనల్​స్థాయిలో పని చేసే ఈ టాస్క్​ఫోర్స్​టీమ్​లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) నుంచి ఇద్దరు ఇంజినీర్లు, ఎన్ ఫోర్స్ మెంట్ నుంచి ఒక ఆఫీసర్, సిబ్బంది కూడా ఉంటారు. వీరికి జోనల్ కమిషనర్ నేతృత్వం వహిస్తారు. ముందు అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదు వస్తే న్యాక్ ఇంజినీర్లు పరిశీలించి ఏఎంసీకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ఏఎంసీ (అసిస్టెంట్​మున్సిపల్​కమిషనర్)

అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ కు సిఫార్సు చేస్తుంది. అయితే, రిపోర్టు డిప్యూటీ, జోనల్ కమిషనర్ల వరకు వెళ్తున్నా వారు నోటీసులు ఇవ్వడం వరకే పరిమితమవుతున్నారు. ఎవరైనా ప్రశ్నించినప్పుడు చూసుకుందాం లే అనుకుని ఊరుకుంటున్నారు. ఈ క్రమంలో పునాది స్థాయిలో మొదలైన బిల్డింగులు..​గృహ ప్రవేశం వరకూ వెళ్తున్నాయి. జోనల్ స్థాయిలో ఆఫీసర్లు  మామూళ్లు తీసుకోవడం వల్లే చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 

ALSO READ : మణికొండ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

మూసాపేట సర్కిల్ లోని ఫతేనగర్ మెయిన్​రోడ్డుపై పర్మిషన్​ లేకుండా ఐదంతస్తుల బిల్డింగును కడుతున్నారని అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. 10 రోజుల కింద కూకట్ పల్లి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు కూడా కంప్లయింట్​చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో బల్దియా కమిషనర్, ఏసీబీ కమిషనర్, హైడ్రా కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. మెయిన్​రోడ్డుపై దర్జాగా నిర్మిస్తున్నా బల్దియా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసినప్పుడు నిర్మాణ దశలో ఉండగా.. ఇప్పుడు పెయింటింగ్​వేసే దశకు చేరుకుంది.  

అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో అనుమతులు లేకుండా నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మిస్తున్నారని గుర్తించిన అధికారులు ఈ ఏడాది జులై12న షాకాజ్​నోటీసు జారీ చేశారు. అయినా నిర్మాణదారుడు స్పందించకపోవడంతో అదే నెలలో స్పీకింగ్ నోటీసులిచ్చారు. రెస్పాన్స్​లేకపోవడంతో ఆగస్టు 17న మరో నోటీసు ఇచ్చారు. పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తుండడంతో కూల్చాల్సి ఉండగా ఎలాంటి యాక్షన్​తీసుకోవడం లేదు. కనీసం సీజ్ కూడా చేయట్లేదు.