అయ్యప్ప సొసైటీలో అక్రమ బిల్డింగ్‌‌ కూల్చివేత

  • గతంలోనే బల్దియా నోటీసులు
  • హైకోర్టు ఆర్డర్స్‌‌ ఇచ్చినా పట్టించుకోని నిర్మాణదారులు
  • స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేసిన హైడ్రా

మాదాపూర్, వెలుగు : హైదరాబాద్‌‌ మాదాపూర్‌‌ అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని ఎలాంటి పర్మిషన్‌‌ లేకుండా నిర్మిస్తున్న ఓ బిల్డింగ్‌‌ను ఆదివారం హైడ్రా కూల్చివేసింది. శేరిలింగంప‌‌ల్లి మండ‌‌లం ఖానామెట్‌‌ విలేజ్‌‌లోని అయ్యప్ప సొసైటీ సర్వే నంబర్‌‌ 11/5లో ప్లాట్‌‌ నంబర్‌‌ 5/13 పేరిట 684 గ‌‌జాల్లో పర్మిషన్లు లేకుండా సెల్లార్‌‌, గ్రౌండ్‌‌ ఫ్లోర్‌‌ కాకుండా మరో ఐదు అంతస్తుల బిల్డింగ్‌‌ నిర్మిస్తున్నారు. స్థానికులు బల్దియా ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో చందానగర్‌‌ సర్కిల్‌‌ టౌన్‌‌ ప్లానింగ్‌‌ ఆఫీసర్లు గతేడాది ఫిబ్రవరి14న షోకాజ్‌‌ నోటీసులు, అదే నెల 26న స్పీకింగ్‌‌ ఆర్డర్స్‌‌ ఇచ్చారు. 

బిల్డింగ్‌‌ను కూల్చివేయాలని హైకోర్టు సైతం ఆదేశించడంతో బల్దియా ఆఫీసర్లు జూన్‌‌ 13న బిల్డింగ్‌‌ స్లాబ్స్‌‌కు రంధ్రాలు చేసి కూల్చివేశారు. తర్వాత 3 నెలల పాటు పనులు ఆపేసిన నిర్మాణదారులు తర్వాత తిరిగి ప్రారంభించారు. దీంతో స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన హైడ్రా, రెవెన్యూ, బల్దియా అధికారుల‌‌తో క‌‌లిసి శనివారం బిల్డింగ్‌‌ను పరిశీలించారు. ఆదివారం బిల్డింగ్‌‌ వద్దకు హైడ్రా ఆఫీసర్లు, డీఆర్ఎఫ్ బృందాలు, మాదాపూర్‌‌ పోలీసులు చేరుకున్నారు. కరెంట్‌‌ సప్లై నిలిపివేసి, ట్రాఫిక్‌‌ను మళ్లించారు. మధ్యాహ్నం కూల్చివేత పనులు మొదలు పెట్టగా అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. 

అయ్యప్ప సొసైటీలో అన్ని అక్రమ నిర్మాణాలే : హైడ్రా చీఫ్​

అయ్యప్ప సొసైటీలో అన్ని కట్టడాలు అక్రమమేనని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ చెప్పారు. మొదట హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన బిల్డింగ్‌‌లను మాత్రమే కూల్చివేస్తున్నట్లు చెప్పారు. అక్రమ బిల్డింగ్‌‌లకు నిర్మాణ అనుమ‌‌తులిచ్చిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని రిపోర్ట్‌‌ తయారు చేస్తున్నామన్నారు. సొసైటీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు బల్దియా కమిషనర్‌‌తో రివ్యూ నిర్వహించి, సమన్వయంతో చర్యలు తీసుకుంటామ‌‌ని చెప్పారు.