డిజైన్ ​లోపంతోనే కోల్​బంకర్​ పిల్లర్లకు పగుళ్లు

  • డిజైన్ ​లోపంతోనే అని ఐఐటీ సైంటిఫిక్​ సర్వేలో వెల్లడి 
  • ఐదు నెలలుగా బంకర్​ నుంచి నామమాత్రపు కోల్ ట్రాన్స్​పోర్ట్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్​ కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి ప్రాంతంలో రూ. 398కోట్లతో సీహెచ్ పీలో నిర్మించిన మూడు కోల్​బంకర్లు, ఇతర పనుల్లో ఆఫీసర్ల పర్యవేక్షణ కొరవడింది. ప్రైవేట్​సంస్థ ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో సింగరేణికి రూ. కోట్ల నష్టం ఏర్పడింది. బంకర్ల డిజైన్​లోపంతో పిల్లర్లకు రెండేండ్లకే పగుళ్లు ఏర్పడ్డాయి. ఐఐటీ స్టూడెంట్స్​చేసిన సైంటిఫిక్​ స్టడీలో ఆసక్తి ఈ  విషయాలు వెల్లడయ్యాయి. డిజైన్​లోపంతోనే పిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయనే రిపోర్టులు ఆఫీసర్లకు ఇటీవల అందాయి. 

 ఆఫీసర్ల పర్యవేక్షణ లోపమేనా?

కొత్తగూడెం ఏరియా సత్తుపల్లి ప్రాంతంలో రెండున్నరేండ్ల కింద  రూ. 398 కోట్లతో కోల్​హ్యాండ్లింగ్​ ప్లాంట్, దానికి అనుబంధంగా ఇతర పనులను ఓ ప్రైవేట్​సంస్థకు టెండర్​ ద్వారా యాజమాన్యం అప్పగించింది. ఒక్కో బంకర్​ ద్వారా ప్రతి రోజు 8వేల టన్నుల బొగ్గు రైల్వే వ్యాగన్లలో లోడయ్యే విధంగా డిజైన్​ చేపట్టాల్సి ఉంది. కానీ ఆ సంస్థ మూడు వేల టన్నుల నుంచి నాలుగు వేల టన్నుల కేపాసిటీ ఉండేలా బంకర్​ నిర్మించినట్టుగా ఐఐటీ సైంటిఫిక్​ రీసెర్చ్​లో వెల్లడైంది. నిర్మాణం టైంలో టెండర్లో పేర్కొన్న విధంగా పనులను పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రెండేండ్లకే బంకర్​కు పగుళ్లు వచ్చాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 

మూడు నుంచి నాలుగేండ్లు 

బంకర్లను నిర్మించే సంస్థే మూడు నుంచి నాలుగేండ్ల పాటు నిర్వహణ బాధ్యత చేపట్టాలి. కానీ సత్తుపల్లిలో నిర్మించిన బంకర్ల నిర్వహణ బాధ్యత కేవలం ఏడాది పాటు ఉండే విధంగా అధికారులు టెండర్లలో పేర్కొన్నారు. మూడు బంకర్లకు గాను ఒక్కో బంకర్​ 8వేల టన్నుల కోల్​ రైల్వే వ్యాగన్లలో లోడింగ్​చేయాల్సి ఉంది. కానీ ఐఐటీ ఆధ్వర్యంలో రీసెర్చ్​ చేసిన నిపుణులు ఓ బంకర్​కు పగుళ్లు ఏర్పడడాన్ని గుర్తించారు.

కేవలం మూడు నుంచి నాలుగు వేల టన్నుల సామర్థ్యంతోనే బంకర్లను నిర్మించారని, ఈ క్రమంలోనే ఓ బంకర్​కు పగుళ్లు వచ్చాయని నిపుణులు వెల్లడించారు. దీంతో బంకర్​ ద్వారా రైల్వే వ్యాగన్లలోకి లోడింగ్​ నామమాత్రం చేశారు. పగుళ్లు ఏర్పడిన బంకర్​కు రిపేర్లు చేసేందుకు రూ. కోట్లలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

నివేదికలొచ్చాయి 

సత్తుపల్లిలో కోల్​ హ్యాండ్లింగ్​ ప్లాంట్లలో ఒకదానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీనిపై ఐఐటీ నిపుణులు చేసిన రీసెర్చ్​ నివేదికలు తమకు రెండు రోజుల కిందటే వచ్చాయి. ఈ నివేదికలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.  - సూర్యానారాయణ, జీఎం సివిల్​, సింగరేణి