దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ మరోసారి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. దాని తర్వాతి స్థానంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీ బాంబే నిలిచాయి. ఈ జాబితాలోని తదుపరి ర్యాంకింగ్స్ ను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్ పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గౌహతి, న్యూఢిల్లీ ఎయిమ్స్, జేఎన్ యూ న్యూఢిల్లీ సాధించాయి. కేంద్ర విద్యాశాఖ కు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) కార్యక్రమంలో భాగంగా ఉన్నత విద్యాసంస్థలకు ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. ర్యాంకుల వివరాలతో కూడిన జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం విడుదల చేశారు.
గత మూడేళ్లుగా ఈ జాబితాలో ఐఐటీ మద్రాస్ తొలి స్థానంలో కొనసాగుతోంది. టాప్ ఐఐటీల జాబితాలో ఐఐటీ హైదరాబాద్ 9వ స్థానం కైవసం చేసుకుంది. 2021 సంవత్సరంలో అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నాలుగో స్థానం దక్కగా, ఈసారి ఆ స్థానాన్ని పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ యూనివర్సిటీ కైవసం చేసుకుంది. ఈ ఏడాది హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ 10వ ర్యాంక్ కు పరిమితమైంది. దేశంలోని టాప్ ఫార్మసీ కాలేజీల్లో హైదరాబాద్ కు చెందిన నైపర్ (ఎన్ఐపీఈఆర్) కు రెండో స్థానం దక్కింది. ఈ కేటగిరీలో ఢిల్లీలోని జామియా హమ్దర్ద్ మొదటి స్థానంలో నిలిచింది. కాగా, 2022 సంవత్సరంలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కోసం దేశవ్యాప్తంగా 7,254 అత్యున్నత విద్యాసంస్థలు పాల్గొన్నాయి. మొత్తం 11 విభాగాల్లో విద్యా సంస్థలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు.
టాప్ 3 మేనేజ్మెంట్ విద్యా సంస్థలు.. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోల్‌కతా
టాప్ 3 లా కాలేజీలు.. నేషనల్ లా స్కూల్ బెంగళూరు, నేషనల్ లా యూనివర్సిటీ న్యూఢిల్లీ, సింబియాసిస్ లా స్కూల్ పూణే
టాప్ 3 మెడికల్ కాలేజీలు.. ఎయిమ్స్ న్యూఢిల్లీ, పీజీఐఎంఐ చండీగఢ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వేలూర్ (తమిళనాడు)
