దర్యాప్తు ఆధారంగానే ఎఫ్ఐఆర్​లో నరేందర్ పేరు : ఐజీ సత్యనారాయణ

  • విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయిస్తం

హైదరాబాద్ సిటీ, వెలుగు: దర్యాప్తు ఆధారంగానే ఎఫ్ఐఆర్​లో కొడంగల్​ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేరు చేర్చామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి, సురేశ్ విచారణకు సహకరించకుంటే వారి బెయిల్  రద్దు కోసం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. వికారాబాద్​ జిల్లా పరిగి సర్కిల్  ఆఫీసులో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. కండిషన్  బెయిల్ పై ఉన్న వ్యక్తి.. విచారణను ప్రభావితం చేసేలా  ప్రవర్తించకూడదని ఐజీ చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుడిగా ఉన్న సురేశ్​ వాయిస్  రికార్డును అవసరమైన సమయంలో బయటపెడతామని తెలిపారు. 

నరేందర్ రెడ్డి తన ఫోన్ పాస్​వర్డ్  చెప్పడం లేదని, ఆయన సహకరిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. సురేశ్​ మాయమాటలు చెప్పి కలెక్టర్ ను తీసుకెళ్లాడన్నారు. అనుమానితులను మూడు విడతలుగా అరెస్ట్​ చేసి వదిలేశామే తప్ప ఎవరినీ కొట్టలేదని స్పష్టంచేశారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారిలో 15 మందికి భూమి లేదని విచారణలో తేలిందన్నారు. ‘‘అక్టోబర్ 27న నరేందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్​మెంట్  సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరినైనా తరిమికొడతామన్న స్టేట్​మెంట్  ఇచ్చారు. కలెక్టర్  తన కాన్వాయ్ లో ఉండగానే కాన్వాయ్ పై బండరాళ్లతో దాడిచేశారు. జరగరానిది ఏదైనా జరిగి ఉంటే పర్యవసానం తీవ్రంగా ఉండేది. 

లగచర్ల ఘటన రోజు 230 మంది పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. ఘటనా స్థలానికి వెళ్లవద్దని పోలీసులు చెప్పినా రైతులకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో కలెక్టర్  వెళ్లారు. ఘటనకు ముందురోజు సురేశ్​ మణికొండ నుంచి లగచర్ల ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి లిక్కర్   తెప్పించారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. అలాగే, రైతులకు బేడీలు వేసిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకున్నాం” అని ఐజీ వెల్లడించారు.