అప్పుడు రూ.30 లక్షలు ఇచ్చుంటేనా..

అప్పుడు రూ.30 లక్షలు ఇచ్చుంటేనా..

న్యూఢిల్లీ: అది 2011 సంవత్సరం.  ఓయోను నిలబెట్టడానికి రితేశ్‌‌ అగర్వాల్‌‌ నిధుల వేట సాగిస్తున్న రోజులవి. ఏర్‌‌బీఎన్‌‌బీ లాంటి హోటల్ బుకింగ్ వెబ్‌‌సైట్‌‌ను సృష్టించడానికి విపరీతంగా కష్టపడుతున్నాడు. అప్పుడు రితేశ్‌‌ వయసు కేవలం 17 ఏళ్లు. రూ.30 లక్షలు ఇస్తే తన కంపెనీలో 15 శాతం వాటా ఇస్తానని మరో ఎంటర్‌‌ప్రిన్యూర్‌‌, ఇన్వెస్టర్‌‌ విశాల్‌‌ గోండాల్‌‌ను కోరారు. కాలేజీ చదువు కూడా పూర్తి చేయని కుర్రవాడి వ్యాపారంలో భాగస్వామ్యం తీసుకోవడానికి ఆయన సంకోచించారు. ఓయో ద్వారా నెలకు తొమ్మిది లక్షల హోటల్‌‌ బుకింగ్స్‌‌ సాధిస్తానని, వార్షికాదాయం రూ.650 కోట్లకు చేరుస్తానన్న రితేశ్‌‌ మాటలను విశాల్‌‌ నమ్మలేదు. ఆనాడు రూ.30 లక్షలు పెట్టి 15 శాతం వాటా కొనుంటే విశాల్‌‌ చేతిలో వేల కోట్ల రూపాయలు ఉండేవి.

ఇదే విషయమై విశాల్‌‌ స్పందిస్తూ ‘‘చిన్న వయసులోనే పెద్ద ఆశలున్న కుర్రవాడిని ఆరోజు కలుసుకోవడం చాలా ఆసక్తిగా అనిపించింది. ఒరావెల్‌‌లో ఇన్వెస్ట్‌‌ చేయాలా వద్దా అనే విషయమై నాకు అప్పుడు స్పష్టత లేదు. పరిచయం లేని వారి ఇళ్లలో ఉండటానికి ఇండియన్లు ఇష్టపడతారో లేదో అనే అనుమానం కలిగింది. రితేశ్‌‌ చెప్పిన సంఖ్యలు చాలా పెద్దవి! అయినా రితేశ్‌‌ ఆఫర్‌‌ను తిరస్కరించవద్దని అనిపించింది. అందుకే కొన్నాళ్లు చూశాక ఇన్వెస్ట్‌‌ చేద్దాం అనుకున్నా. ఇక నుంచి మిమ్మల్ని ఎవరైనా యువకుడు పెట్టుబడి అడిగితే కాదనకండి’’ అని ఒక వ్యాసంలో ఆయన వివరించారు.

రితేశ్‌‌ స్థాపించిన ఒరావెల్‌‌ ఇప్పుడు ఓయో హోటల్స్‌‌ను, హోమ్స్‌‌ను నడుపుతోంది. గదుల సంఖ్యను బట్టి చూస్తే ప్రపంచంలో మూడో అతిపెద్ద హోటల్‌‌ చైన్‌‌ ఇది. ఈ స్టార్టప్ విలువ ఇప్పుడు 10 బిలియన్‌‌ డాలర్లు (దాదాపు రూ.69 వేల కోట్లు). తన కంపెనీలో ఇన్వెస్ట్‌‌ చేయకపోయినప్పటికీ, విశాల్‌‌ను స్టార్టప్‌‌ హీరోగా అభివర్ణించారు రితేశ్‌‌. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. అప్పట్లో టాప్‌‌ డిజైనర్‌‌గా వెలుగొందిన విశాల్‌‌ తన స్టార్టప్‌‌ ఇండియాగేమ్స్‌‌ను వాల్ట్‌‌డిస్నీకి రూ.680 కోట్లకు అమ్మేశాడు. ఇప్పుడు ఆయన గూకీ పేరుతో వేరబుల్‌‌ టెక్‌‌ కంపెనీని నడుపుతున్నారు.