రైతుల ముందు ఏ శక్తీ నిలవలేదు

రైతుల ముందు ఏ శక్తీ నిలవలేదు
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్‌‌ను కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కలిశారు. రాహుల్‌‌ వెంట పార్టీ సీనియర్లు గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌధురితోపాటు ప్రియాంక గాంధీ వాద్రాలు ఉన్నారు. రైతుల ఆందోళనలతో నెలకొన్న పరిస్థితి గురించి రాష్ట్రపతికి రాహుల్ వివరించారు. కొత్త అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన మెమొరాండమ్‌‌ను కోవింద్‌‌కు అందించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేలా చూడాలని కోరారు. ‘కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టాన్ని కలిగించే విధంగా ఉన్నాయని రాష్ట్రపతి కోవింద్‌‌కు వివరించాం. అన్నదాతల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఈ చట్టాల వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వీటితో అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ చట్టాలకు విరుద్ధంగా రైతులు నిలబడటాన్ని మొత్తం దేశం చూస్తోంది. వీటిని రద్దు చేసేంత దాకా రైతులు వెనక్కి తగ్గబోరని, సొంత ఇళ్లకు వెళ్లబోరని ప్రధాని మోడీని హెచ్చరిస్తున్నాం. రైతుల ముందు ఏ శక్తీ నిలవలేదు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్‌‌కే కాదు మొత్తం దేశానికే నష్టం వాటిల్లుతుంది. పార్లమెంట్‌‌లో ఉభయ సభలు నిర్వహించి నూతన అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోండి. విపక్ష పార్టీలన్నీ రైతులకు మద్దతుగా ఉన్నాయి, ఉంటాయి కూడా.. రైతులతో, నేతలతో చర్చించకుండా ఈ చట్టాలను తీసుకొచ్చిన తీరు సరికాదు. ఈ చట్టాలను ఎలాగైనా రద్దు చేయాల్సిందే’ అని రాహుల్ పేర్కొన్నారు. దేశద్రోహులుగా ముద్రవేస్తే సర్కార్‌‌‌కు‌ పాపం తగులుతుంది రాష్ట్రపతిని కలవడానికి ముందు విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు రాహుల్ పాదయాత్రగా వెళ్లారు. ర్యాలీకి అనుమతి లేదని, రాష్ట్రపతితో ముగ్గురికి మాత్రమే అపాయింట్‌‌మెంట్ ఖాయమైందని.. వారిని మాత్రమే రాష్ట్రపతి భవన్‌‌కు అనుమతిస్తామని చెప్పారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులతో నేతలు వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు, కేంద్రంపై ప్రియాక ఫైర్ అయ్యారు. ప్రభుత్వం చేస్తోంది ముమ్మాటికీ తప్పని, రైతులను దేశద్రోహులుగా ముద్ర వేస్తే సర్కార్‌‌కు పాపం తగులుతుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉగ్రవాద ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. ప్రియాంక సహా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని స్టేషన్‌‌కు తరలించారు.