- స్టెరాయిడ్లను అనవసరంగా, ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు
- బ్లాక్ ఫంగస్ లాంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం
- సివియర్ పేషెంట్లకు టొసిలిజుమాబ్ ఇవ్వొచ్చని డాక్టర్లకు సూచన
న్యూఢిల్లీ: కరోనా పేషెంట్లకు దగ్గు రెండు, మూడు వారాలపాటు తగ్గకుండా ఉంటే.. టీబీ టెస్టు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇతర ఆరోగ్య సమస్యలపైనా చెకప్‌లు చేయించుకోవాలని చెప్పింది. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిమ్స్, ఐసీఎంఆర్ కరోనా నేషనల్ టాస్క్‌ఫోర్స్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ కలిసి రివైజ్డ్ ‘క్లినికల్ గైడెన్స్ ఫర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ అడల్ట్ కరోనా పేషెంట్స్’ను జారీ చేశాయి. ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అవసరం లేని కరోనా రోగులకు ఇంజెక్ట్ చేయగల స్టెరాయిడ్లు ప్రయోజనం చేకూర్చినట్లు ఆధారాలు లేవని అందులో పేర్కొన్నాయి. డిశ్చార్జ్ తర్వాత కొనసాగించినా అంతేనని తెలిపాయి. కరోనా సోకిన వెంటనే స్టెరాయిడ్లను ఎక్కువ డోసుల్లో వేసుకున్నా, అవసరమైన దాని కంటే ఎక్కువగా ఉపయోగించినా బ్లాక్ ఫంగస్ లాంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.
రెమ్డెసివర్ ఓకే.. కానీ..
వైరస్ ఎఫెక్ట్ ‘మోస్తరు నుంచి తీవ్రంగా’ ఉన్న పేషెంట్లకు రెమ్డెసివర్ డ్రగ్‌ను అత్యవసరంగా ఇవ్వవచ్చని రివైజ్డ్ గైడ్‌లైన్స్‌లో ఆరోగ్య శాఖ చెప్పింది. కరోనా సింప్టమ్స్ కనిపించిన 10 రోజుల్లోగా ఎలాంటి మూత్రపిండ, కాలేయ సంబంధిత సమస్యలు లేకపోతే రెమ్డెసివర్ ఇవ్వొచ్చని తెలిపింది. అయితే ఇండ్లలో ఐసోలేషన్‌లో ఉంటున్న వాళ్లు, ఆక్సిజన్ సపోర్టుపై లేని వాళ్లకు మాత్రం ఇవ్వవద్దని హెచ్చరించింది.
వీళ్లకు టొసిలిజుమాబ్ ఇవ్వొచ్చు..
టొసిలిజుమాబ్ డ్రగ్ వాడకంపైనా ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. కరోనా ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడే టొసిలిజుమాబ్‌ను అత్యవసరంగా ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అది కూడా డిసీజ్ సివియర్‌గా మారిన లేదా పేషెంట్ ఐసీయూలోకి చేరిన 24 నుంచి 48 గంటల్లోగా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లతో బాధపడుతున్న రోగులకు ఈ డ్రగ్ ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చని చెప్పింది. స్టెరాయిడ్స్ వాడుతున్నా పరిస్థితి మెరుగుపడకపోతే, ఇదే సమయంలో బ్యాక్టీరియా, ఫంగల్ లేదా ట్యూబర్‌క్యులర్ ఇన్‌ఫెక్షన్ లేకపోతే టొసిలిజుమాబ్ మందును పేషెంట్‌కు ఇవ్వవచ్చని తెలిపింది.
టెస్టులు తగ్గినయ్.. పెంచాలి: కేంద్రం
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టెస్టులను తగ్గించాయని, కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు పరీక్షల సంఖ్యను పెంచాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రెటరీ ఆర్తీ అహుజా లెటర్ రాశారు. ‘‘ఐసీఎంఆర్ పోర్టల్‌లో ఉన్న డేటాను బట్టి చూస్తే.. టెస్టులను తగ్గించినట్లు తెలుస్తోంది. టెస్టుల సంఖ్యను పెంచాలి. వివిధ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు అంశంపై దృష్టిపెట్టాలి” అని కోరారు.
ఇంకా ఏం చెప్పిందంటే..
- మెథైల్‌ప్రెడ్నిసోలోన్ ఇంజెక్షన్ 0.5 నుంచి 1 ఎంజీ/కేజీని (రెండు డోసుల్లో), లేదా అందుకు సమానమైన డోసులో డెక్సామెథసోన్‌ను ‘మోడరేట్’ పేషెంట్లకు ఐదు నుంచి 10 రోజుల దాకా ఇవ్వవచ్చు. అలాగే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్లకు ఇవే మందులను 1 నుంచి 2 ఎంజీ/కేజీలను ఐదు నుంచి 10 రోజుల దాకా ఇవ్వవచ్చు.
- కరోనా సోకిన ఐదు రోజుల తర్వాత కూడా జ్వరం, దగ్గు కొనసాగితే.. ‘మైల్డ్’ పేషెంట్లకు ఇన్‌హెలేషనల్ బుడెసోనైడ్ (మీటర్డ్ డోస్ ఇన్‌హేలర్/డ్రై పౌడర్ ఇన్‌హేలర్ ద్వారా ఇస్తరు)ను 800 ఎంసీజీ బీడీ మోతాదులో 5 రోజులు ఇవ్వొచ్చు.
- మైల్డ్ పేషెంట్లకు బ్రీతింగ్ ప్రాబ్లమ్, హై ఫీవర్, తీవ్రమైన దగ్గు 5 రోజుల తర్వాత కూడా ఉంటే.. మెడికల్ కేర్‌కు వెళ్లొచ్చు.
- ఎస్పీఓ2 ఫ్లక్చనింగ్ 90 నుంచి 93 మధ్యలో ఉంటే ఆస్పత్రిలో చేరిపోవాలి. వీరిని మోడరేట్ కేసులుగా పరిగణనలోకి తీసుకోవాలి. ఆక్సిజన్ సపోర్ట్ ఏర్పాటు చేసి, ప్రోనింగ్ చేయించాలి.
- రెస్పిరేటరీ రేటు నిమిషానికి 30 కంటే ఎక్కువ ఉన్నా, ఎస్పీఓ2 90 శాతం కంటే తక్కువగా ఉన్నా సివియర్‌గా పరిగణిం చాలి. అలాంటి పేషెంట్లను ఐసీయూలో ఉంచి, రెస్పిరేటరీ సపోర్ట్ ఇవ్వాలి.
- 60 ఏళ్లు పైబడిన వాళ్లు, గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్, డయాబెటిస్, హెచ్‌ఐవీ, టీబీ, లంగ్, కిడ్నీ, లివర్ డీసీజ్ ఉన్నోళ్లను సివియర్ కేటగిరీలో ఉంచాలి.
