అమౌంట్ క్రెడిట్ కాకపోతే పెనాల్టీ కట్టాల్సిందే

అమౌంట్ క్రెడిట్ కాకపోతే పెనాల్టీ కట్టాల్సిందే

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఆర్‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌, నెఫ్ట్‌‌‌‌ పేమెంట్ సిస్టమ్స్‌‌‌‌తో దేశంలో 24x7  గంటల పాటు  పేమెంట్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. కానీ, ఏదైనా కారణం వలన మనం ఆర్‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌ లేదా నెఫ్ట్ ద్వారా పంపించిన డబ్బులు అవతలి అకౌంట్‌‌‌‌లోకి యాడ్ కాకపోతే ఏమవుతుందని, క్రెడిట్ అయినా అనుకున్న టైమ్‌‌‌‌లో జరగకపోతే ఏం జరుగుతుందని ఒక్కసారి అయినా ఆలోచించి ఉంటారు. సాధారణంగా  బెనిఫిషరీ అకౌంట్‌‌‌‌లలో మనీ క్రెడిట్ కాకపోతే, ఆ అమౌంట్ తిరిగి కస్టమర్ అకౌంట్‌‌‌‌కు రీఫండ్​ అయిపోతాయి. ఒకవేళ అలా జరగకపోతే  బ్యాంకులు కస్టమర్‌‌‌‌‌‌‌‌కు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

నెఫ్ట్‌‌‌‌తో..

ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వెబ్‌‌‌‌సైట్ ప్రకారం, బ్యాంక్‌‌‌‌ ద్వారా జరిగే నెఫ్ట్ ట్రాన్సాక్షన్లు  ప్రతీ అరగంటకు బ్యాచ్‌‌‌‌లు రూపంలో సెటిల్‌‌‌‌మెంట్ హౌస్‌‌‌‌కు చేరుకుంటాయి. అంటే నెఫ్ట్ ట్రాన్సాక్షన్ల  సెటిల్‌‌‌‌మెంట్స్‌‌‌‌ రోజులో 48 బ్యాచ్‌‌‌‌ల కింద జరుగుతుంటాయి.  నెఫ్ట్ బ్యాచ్ సెటిల్‌‌‌‌మెంట్స్‌‌‌‌ జరిగిన రెండు గంటల్లోపు  కస్టమర్ పంపిన అమౌంట్‌‌‌‌ బెనిఫిషరీ అకౌంట్‌‌‌‌లలో క్రెడిట్ అవుతుంది. ఒకవేళ ఆ  తర్వాత కూడా అమౌంట్ క్రెడిట్ కాకపోతే  బ్యాంకు ఈ  కస్టమర్‌‌‌‌‌‌‌‌కు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.  బెనిఫిషరీ అకౌంట్ క్రెడిట్ అవ్వడంలో ఎన్ని రోజులు లేటు అయితే అన్ని రోజులు లేదా రీఫండ్​‌‌‌‌ ఎన్ని రోజులు లేటు అయితే అన్ని రోజులకు గాను ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ లిక్విడిటీ అడ్జెస్ట్‌‌‌‌మెంట్ ఫెసిలిటీ (ఎల్‌‌‌‌ఏఎఫ్‌‌‌‌) రెపో రేటును ఫ్లస్‌‌‌‌ 2 శాతం వడ్డీని  కస్టమర్‌‌‌‌‌‌‌‌కు బ్యాంక్ చెల్లించాలి.  ప్రస్తుతం ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఎల్‌‌‌‌ఏఎఫ్‌‌‌‌ రెపో రేటు 4.90 శాతంగా ఉంది. అంటే నెఫ్ట్‌‌‌‌ ద్వారా పంపిన అమౌంట్ బెనిఫిషరీ అకౌంట్‌‌‌‌లో ఇచ్చిన టైమ్‌‌‌‌లో  క్రెడిట్ అవ్వకపోతే సంబంధిత బ్యాంక్ ఈ కస్టమర్‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌ఫర్ అమౌంట్‌‌‌‌లో 6.90 శాతాన్ని పెనాల్టీ కింద కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెఫ్ట్‌‌‌‌ కింద గరిష్టంగా రూ. 10 లక్షలు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసుకోవచ్చు. కనిష్టంగా ఎంత పంపాలనేదానిపై పరిమితులు లేవు. 

ఆర్‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌తో..

సాధారణ  పరిస్థితుల్లో ఆర్‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌ ద్వారా మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్ చేస్తే బెనిఫిషరీ అకౌంట్‌‌‌‌లో వెంటనే మనీ క్రెడిట్ అవుతాయి. ఫండ్స్ ట్రాన్స్‌‌‌‌ఫర్ అయినట్టు మెసెజ్ వచ్చిన తర్వాత గరిష్టంగా 30 నిమిషాల్లోనే బెనిఫిషరీ అకౌంట్‌‌‌‌లో మనీ క్రెడిట్ అయిపోతాయి. ఒకవేళ ఏ కారణం చేతనైనా  బెనిఫిషరీ అకౌంట్‌‌‌‌లో మనీ క్రెడిట్ అవ్వకపోతే బెనిఫిషరీ బ్యాంక్  ఈ అమౌంట్‌‌‌‌ను వెంటనే తిరిగిరీఫండ్​‌‌‌‌ చేసేస్తుంది. ‘ఏ కారణం చేతనైనా బెనిఫిషరీ అకౌంట్‌‌‌‌లో అమౌంట్‌‌‌‌ను క్రెడిట్‌‌‌‌ చేయలేకపోతే  ఆర్‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌ మెంబర్ అయిన బెనిఫిషరీ బ్యాంక్ ఈ అమౌంట్‌‌‌‌ను గరిష్టంగా గంట లేదా ఆర్‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌ పని రోజు పూర్తయ్యే లోపు (ఏది ముందు జరిగితే అది) అమౌంట్‌‌‌‌ను రీఫండ్​ చేయాలి’ అని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ తన వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పేర్కొంది.  ఈ అమౌంట్‌‌‌‌  కస్టమర్ బ్యాంక్ అకౌంట్‌‌‌‌కు తిరిగి చేరుకున్నాక కస్టమర్ బ్యాలెన్స్ అప్‌‌‌‌డేట్ అవ్వాలని వివరించింది. ఒకవేళ ఆర్‌‌‌‌‌‌‌‌టీజీఎస్ ద్వారా మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసిన కస్టమర్‌‌‌‌‌‌‌‌కు రీఫండ్​ లేటుగా వచ్చిందని అనుకుంటే సంబంధిత బ్యాంక్‌‌‌‌ ప్రస్తుత రెపోరేటు ప్లస్ 2 శాతం వడ్డీని అంటే 6.9 శాతం  వడ్డీని కస్టమర్‌‌‌‌‌‌‌‌కు పెనాల్టీగా కట్టాల్సి ఉంటుంది. 

ఫిర్యాదు చేయొచ్చు..

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీజీఎస్‌‌‌‌, నెఫ్ట్‌‌‌‌  ద్వారా పంపిన డబ్బులు  ఆలస్యంగా రిఫండ్‌‌‌‌ అయినా లేదా బెనిఫిషరీ అకౌంట్‌‌‌‌లో క్రెడిట్‌‌‌‌ కాకపోయినా  కస్టమర్ తమ బ్యాంక్ బ్రాంచ్‌‌‌‌ను సంప్రదించొచ్చు. అప్పటికీ కస్టమర్‌‌‌‌‌‌‌‌ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ అంబుడ్స్‌‌‌‌మన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ (ఐఓఎస్‌‌‌‌) కింద  ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు నమోదయిన 30 రోజుల్లోపు కస్టమర్‌‌‌‌‌‌‌‌ సమస్య పరిష్కారం అవుతుంది. అప్పటికీ పరిష్కారం కాకపోతే ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రెగ్యులేట్ చేస్తున్న సంస్థల వద్ద ఫిర్యాదును నమోదు చేయడానికి ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఐఓఎస్‌‌‌‌ వీలు కలిపిస్తుంది.