న్యూఢిల్లీ: హిందువైన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా దేశభక్తుడై ఉంటాడని, అది వాళ్ల సహజ స్వభావం అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశభక్తి అనేది ధర్మంతో ముడిపడిన అంశమని జాతిపిత మహాత్మా గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన పైవిధంగా కామెంట్ చేశారు. జేకే బజాజ్, ఎండీ శ్రీనివాస్‌లు రాసిన ‘మేకింగ్ ఆఫ్ ఏ హిందూ పేట్రియాట్: బ్రాగ్రౌండ్ ఆఫ్ గాంధీజీస్ హింద్ స్వరాజ్’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందూయిజం, దేశభక్తి లాంటి విషయాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
‘గాంధీజీ తనకున్న దేశభక్తి ధర్మం నుంచి వచ్చిందని చెప్పారు. ధర్మం అనేది మతం కంటే విస్తృతమైంది. దాని పరిధి చాలా పెద్దది. ఎవరైనా ఓ వ్యక్తి హిందువైతే అతడు దేశభక్తుడై ఉంటాడు. అది అతడి ప్రధాన, సహజ ప్రవృత్తి అయి ఉంటుంది. కొన్నిసార్లు వారిలోని దేశభక్తిని తట్టిలేపాల్సి వస్తుంది. కానీ ఏ హిందువైనా ఎప్పటికీ భారత వ్యతిరేకి మాత్రం కాడు. మరో విషయంపై మనం జాగరూకతతో ఉండాలి. దేశాన్ని ప్రేమించడం అంటే.. ఈ నేలను ఇష్టపడటమే కాదు. ఇక్కడి ప్రజలు, నదులు, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు అన్నింటినీ ప్రేమించాలి. ఏకత్వ ఉనికిని హిందూయిజం నమ్ముతుంది. హిందూ మతం సర్వమతాల సమ్మేళనమని మహాత్ముడు చేసిన వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలి’ అని భగవత్ పేర్కొన్నారు.
