తమిళనాడు వాసి కాదు కాబట్టే జట్టులో ఉన్నాడు.. లేదంటే అతని కెరీర్ ముగిసేది: బద్రీనాథ్‌

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3 తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఆఖరి టెస్టులో గెలిచుంటే..  కనీసం వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశలైనా సజీవంగా ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేవు. ఈ పరాజయాలకు ఎన్నో కారణాలు. బ్యాటింగ్‌లో అగ్రశ్రేణి బ్యాటర్ల వైఫల్యం.. పసలేని బౌలర్లు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన యువ ఆటగాళ్లు చేతులెత్తేయడం.. ఇలా ఎన్నో కారణాలూ. 

నిజాలు మాట్లాడుకోవాలంటే.. ఆసీస్ పర్యటనలో రాణించిన భారత ఆటగాళ్లు ముగ్గురే ముగ్గురు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా(32 వికెట్లు) ఒంటరి సైనికుడిలా పోరాడగా.. బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (10 ఇన్నింగ్స్ ల్లో 391), నితీశ్ కుమార్ రెడ్డి (9 ఇన్నింగ్స్ 298) పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లందరూ తీవ్రంగా నిరాశపర్చారు. భారత జట్టు భవిష్యత్ స్టార్ గా పేరుమోసిన శుభ్‌మన్ గిల్ (5 ఇన్నింగ్స్ ల్లో 93) కూడా నిలకడ ప్రదర్శించలేకపోయాడు. ఈనేపథ్యంలో అతనిపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్‌ విరుచుకుపడ్డారు. గిల్ ఓవర్ రేటెడ్ ప్లేయర్ అని ఆరోపించాడు.

ALSO READ : Team India: బుమ్రాను చెరకు రసం పిండినట్లు పిండారు: మాజీ స్పిన్నర్

ఇన్ని ఫేలవ ప్రదర్శనలు చేశాక కూడా గిల్ భారత జట్టులో కొనసాగుతున్నాడంటే.. అందుకు తమిళనాడు వాసి కాకపోవడమే కారణమని సుబ్రమణ్యం బద్రీనాథ్ బోల్డ్ స్టేట్‌మెంట్‌తో వివాదం రేపారు. ఒకవేళ అతని స్థానంలో తమిళనాడు ప్లేయర్ ఉన్నట్టయితే.. ఎప్పుడో కెరీర్ ముగిసిపోయి ఉండేదని ఆరోపించాడు.  

బౌలర్లనైనా కష్టపెట్టాలి కదా..! 

 "అతని(శుభ్‌మన్ గిల్) ఆట చూడటం నాకు చాలా కష్టంగా అనిపించింది. స్థాయికి తగ్గ అంచనాలను అందుకోలేకపోయాడు. ఆటగాడిలో పరుగులు చేయాలనే కసి, తపన ఉంటే.. క్రీజులో ఆ దూకుడు కనిపించేది. అతని ఆ ఉద్దేశ్యం ఉన్నటు నాకెక్కడా అనిపించలేదు. పరుగులు చేయలేనప్పుడు కనీసం బౌలర్లనైనా అలసిపోయేలా చేయాలని నేను కోరుకున్నా.. అదీ లేదు"

"నాణ్యమైన ప్లేయర్ పరుగులు రాకపోయినా స్థిరంగా నిలబడాలి. కనీసం 100 బంతులు ఆడాలి.. ప్రత్యర్థి బౌలర్లను అలిసిపోయేలా చేయాలి. ఆ సహాయం కూడా జట్టుకు ఉపయోగపడేదే. లబుషేన్, మెక్‌స్వీనీ అలానే చేశారు. డాట్ బాల్స్ ఆడి బుమ్రాను విసిగించారు.. గాయపరిచారు.. " అని బద్రీనాథ్ స్టార్ స్పోర్ట్స్ తమిళ్‌లో ఆరోపించారు.