బిజినెస్ డెస్క్, వెలుగు: చౌకైన షేర్లే చాలాసార్లు పెద్ద లాభాలను ఇస్తాయి.. సరియైన షేరును పట్టుకుంటే లంకెబిందెలు దొరికినట్టే. ఈ ఏడాది అతిపెద్ద క్రాష్ తర్వాత స్టాక్‌మార్కెట్లు తిరిగి పుంజుకున్న విషయం తెలిసిందే. దీంతో సుమారు 166 పెన్నీ షేర్లు (చౌకైన షేర్లు) ఇన్వెస్టర్ల పంట పండించాయి. ఈ షేర్లలో బిర్లా టైర్స్ వంటివి ఏకంగా 1,443 శాతం పెరిగాయి. కాకపోతే, ఈ పెన్నీ షేర్లను కనిపెట్టడం అంత ఈజీ కాదనే కచ్చితంగా చెప్పాలి. కొత్త ఇన్వెస్టర్లు వీటికి దూరంగా ఉండాలని ఎనలిస్టులు కూడా సలహా ఇస్తున్నారు. ఈ షేర్లలో లిక్విడిటీ ఫ్లో తక్కువగా ఉంటుందని, కొంత మంది ఇన్వెస్టర్లు, ప్రమోటర్లే ఈ షేర్లను కదలికకు కారణమవుతారని చెబుతున్నారు. షేర్లు లాభాల్లో ఉన్నా అమ్మేటప్పుడు ఎవరూ కొనకపోతే చిన్న ఇన్వెస్టర్లు ఇరుక్కుపోతారని హెచ్చరిస్తున్నారు.
పెన్నీ షేర్లు అందరి కోసమా?
పెన్నీ షేర్లు అందరి కోసం కాదని ఢిల్లీకి చెందిన సీనియర్ ట్రేడర్ వివేక్ బౌకా చెప్పారు. పెన్నీ షేర్లను గుర్తించడంలో ఫండ్‌మెంటల్స్ కంటే షేర్ ప్యాటర్న్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఈ షేర్లు ఏర్పరిచే ప్యాటర్న్‌లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని, షేరు ప్యాటర్న్‌లను అర్థం చేసుకున్న వారే ఈ షేర్ల నుంచి లాభాలను ఆర్జించగలరని చెప్పారు. ధరలో లేదా వాల్యూమ్‌లలో చేంజ్ వలన ఏర్పడే ప్యాటర్న్‌లను అర్థం చేసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. వికాస్ ప్రొప్పంట్ షేర్ గురించి ఆయన ప్రస్తావించారు. ‘ఈ కంపెనీ షేర్లను రూ. 1.5– రూ.2 ఉన్నప్పుడు నేను కొనుగోలు చేశాను. ఈ షేరు తన కొత్త మంత్లీ అప్పర్ సర్క్యూట్‌ను నిలకడగా తాకుతుండడాన్ని గమనించాను. ఆ తర్వాత ఈ కంపెనీ కొన్ని ప్రకటనలు చేసింది. ఈ పెన్నీ షేర్ మరో గరిష్ట స్థాయిని తాకింది. ఈ స్టాకు తర్వాతి మూడు నెలల్లో రూ. 15 కు చేరుకుంది. ఈ కంపెనీ ఫండమెంటల్స్ లేదా మేనేజ్‌మెంట్ చెప్పే స్టోరీని నేను నమ్మలేదు. షేర్ ప్యాటర్న్‌ను మాత్రమే ఫాలో అయ్యాను’ అని బౌకా అన్నారు. ‘ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్ ఇండి డియాబుల్స్ రియల్ ఎస్టేట్ నుంచి డీమెర్జ్ అయి అప్పుడే మార్కెట్లో లిస్ట్ అయ్యింది. మొదటి రోజే మార్కెట్లో లిస్టయిన 5 కోట్ల షేర్లలో 2 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఈ కంపెనీ షేరు రూ.7 వద్ద ఉన్నప్పుడు రూ. 5 స్టాప్‌లాస్‌తో వీటిని కొనుగోలు చేశాను. నెమ్మదిగా ఈ షేరు రూ. 30 లను తాకింది. తర్వాత రెండెళ్లలో రూ. 800కు చేరుకుంది. ఈ కంపెనీ ఇన్సూరెన్స్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలని ప్లాన్స్ వేసుకొంది. ఈ న్యూస్‌తో కంపెనీ షేరు భారీగా పెరిగింది. నేను వాల్యూమ్ డేటాను చూసే ఈ స్టాక్‌ను కొనుగోలు చేశాను’ అని బౌకా అన్నారు.
పెన్నీ షేర్ల నుంచి లాభం పొందడం ఎలా
గత 20 ఏళ్లలో ఎక్చ్సేంజిలు రక రకాల కారణాలతో, వేల కొద్ది షేర్లను మార్కెట్ల నుంచి తొలగించాయి. ఎక్స్చేంజ్‌లు ఇలా తొలగించడాని కంటే ముందే వాటిలో చాలా షేర్లు పెన్నీ షేర్లుగా మారాయి. ఇన్వెస్టర్లు ఎంచుకునే పెన్నీ షేర్లను మార్కెట్లు తొలగించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అందువలన పెన్నీ షేర్లలోకి ఎంటర్ అయ్యే ముందు ఎగ్జిట్ ప్లాన్ రెడీగా ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. లాభాల గురించి ఆలోచించే ముందే నష్టానికి కొంత కేటాయించాలని, స్టాప్ లాస్‌ను స్ట్రిక్ట్‌గా పాటించాలని అన్నారు. షేర్లలో ఇన్వెస్ట్ చేసేప్పుడు ఎటువంటి ఎమోషన్స్ ఉండకూడదని, రూ. 2 వద్ద షేర్‌ను కొని, రూ. 1 కి పడిపోయినప్పుడు అమ్మడం ఇష్టం లేకపోయినా, అలాంటి షేర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. పెన్నీ షేర్లలో మంచి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, వాటిని గుర్తించడానికి చాలా మార్గాలున్నాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. ‘ కొత్త 52 వారాల గరిష్ట స్థాయిని ఎక్కువసార్లు తాకుతున్న పెన్నీ షేర్లను జాగ్రత్తగా ట్రాక్ చేయాలి. కొత్త హైలను అనేక సార్లు తాకనిదే ఏ పెన్నీ షేరు కూడా మల్టీబాగర్‌గా మారదు. ఒక సారి వీటిని లిస్ట్ చేసుకున్నాకా వీటి ఫండమెంటల్స్‌ను స్టడీ చేయాలి.
