కుల, మతాలకు అతీతంగా మంచి భవిష్యత్‌‌ను అందిస్తాం

కుల, మతాలకు అతీతంగా మంచి భవిష్యత్‌‌ను అందిస్తాం
అలీగఢ్: ఒక దేశ అభివృద్ధిని రాజకీయాల ఆధారంగా అంచనా వేయొద్దని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో నిర్వహించిన సెనెటరీ సెలబ్రేషన్స్‌‌లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ పురోగతిలో సైద్ధాంతిక తేడాలకు ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం దేశం ప్రయాణిస్తున్న మార్గంలో కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ రాజ్యాంగపరమైన హక్కులను కల్పిస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క కమ్యూనిటీ కూడా వెనుకబడకుండా చూసుకుంటామన్నారు. ప్రభుత్వ పథకాలను పేదలకు అందించడంలో ఎలాంటి మతపరమైన అంశాలకు చోటివ్వకుండా జాగ్రత్త వహిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఏ కులం, మతంలో పుట్టామనే దాని కంటే దేశ లక్ష్యాల కోసం మన ఆకాంక్షలను మార్చుకున్నామా అనేదే ముఖ్యం. సమాజంలో సైద్ధాంతికపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ దేశ అభివృద్ధి విషయానికొస్తే.. దేనికైనా రెండో ప్రాధాన్యతే ఇస్తాం. దేశం విషయంలో సైద్ధాంతిక తేడాలకూ చోటుండదు. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పురిటిగడ్డగా చెప్పొచ్చు. ఆ యోధుల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండొచ్చు. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం వాటిని పక్కనబెట్టారు. వారి నుంచి స్ఫూర్తి పొంది, మనం కూడా కొత్త భారత్ కోసం కృషి చేద్దాం. ప్రతికూలతలను పక్కనబెట్టి ఒకే లక్ష్యం కోసం కలసి పని చేద్దాం. గత శతాబ్దంలో మన మధ్య తేడాలతో అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడిక టైమ్ లేదు. డెవలప్‌‌మెంట్ ఆగడానికి వీల్లేదు’ అని మోడీ పేర్కొన్నారు.