ICC T20 Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిలక్ జోరు.. సూర్య సహా 69 మంది వెనక్కి

టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. ఏకంగా 69 స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి దూసుకొచ్చాడు. తన కోసం స్థానాన్ని త్యాగం చేసిన భారత టీ20 కెప్టెన్ సూర్యను సైతం వెనక్కి నెట్టాడు. 

ఈ హైదరాబాదీ క్రికెటర్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో 33, 20 స్కోర్లతో పర్వాలేదనిపించగా.. అనంతరం వరుసగా రెండు సెంచరీలు బాది ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. సఫారీలతో జరిగిన 4 మ్యాచ్‌ల్లో 198 స్ట్రైక్‌రేట్‌తో 280 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనే అతన్ని టాప్ 10లోకి తీసుకొచ్చింది. తిలక్ టీ20 కెరీర్‌లో టాప్‌-10లోకి రావడం ఇదే మొదటిసారి.

22వ స్థానంలో శాంసన్

ఇదే సిరీస్‌లో రెండు వరుస శతకాలు బాదిన శాంసన్.. 17 స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నాడు. మరో రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం అతని ర్యాంకింగ్స్‌ను బాగా దెబ్బతీసింది. ఆ మ్యాచ్‌ల్లో సంజూ 30 పరుగుల చొప్పున చేసున్నా.. టాప్-10లోకి దూసుకొచ్చేవాడు.  

Also Read :- ఇదొక పిచ్చి నిర్ణయం.. మెగా ఆక్షన్ తేదీలపై దిగ్గజ క్రికెటర్లు విమర్శలు 

అగ్రస్థానంలో హెడ్

ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్(855 పాయింట్లు), ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(828 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 8, రుతురాజ్‌ గైక్వాడ్ 15వ స్థానంలో ఉన్నారు.