హైబ్రిడ్ మోడల్‌లోనే చాంపియన్స్‌ ట్రోఫీ: పీసీబీ నిర్ణయం కోరిన ఐసీసీ

కరాచీ: టీమిండియా పాకిస్తాన్‌ వెళ్లబోదని బీసీసీఐ తేల్చిచెప్పిన  నేపథ్యంలో  వచ్చే ఏడాది పాక్ ఆతిథ్యం ఇచ్చే చాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో  నిర్వహించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భావిస్తోంది. దీనిపై ఆతిథ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయం కోసం వేచి చూస్తోంది. 

 అందుకు పీసీబీ ఒప్పుకుంటే  ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లను తటస్థ వేదిక (యూఏఈ)లో, ఫైనల్‌ దుబాయ్‌లో నిర్వహించేలా షెడ్యూల్ చేయనుంది. ఈ విధానం తమకు అనుకూలమో లేదో చెప్పాలని పీసీబీని ఐసీసీ కోరినట్టు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌లో జరిగినా.. పాక్ బోర్డుకు పూర్తి స్థాయి ఆతిథ్య ఫీజులతో పాటు ఎక్కువ మ్యాచ్‌లు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.