Champions Trophy 2025: ఆ నగరాల్లో ట్రోఫీని తిప్పడానికి వీల్లేదు.. పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ ఝలక్

ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ.. దుబాయ్ నుంచి ఇస్లామాబాద్‌కు పంపింది. నవంబర్ 16న ఇస్లామాబాద్‌లో ట్రోఫీ టూర్ ప్రారంభమవుతుంది. నవంబర్ 24 వరకు ట్రోఫీ పర్యటన కొనసాగుతుంది.ఇందులో భాగంగా స్కర్డు, ముర్రీ, హుంజా, ముజఫరాబాద్ వంటి నగరాల్లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీ వెళుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ ) ఒక రోజు క్రితం ప్రకటించింది. అయితే ఈ విషయంలో ఐసీసీ.. పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చింది. 

భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ విభేదాల కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోకి వచ్చే స్కర్డు, ముర్రీ మరియు ముజఫరాబాద్‌లలో జరగాల్సిన ట్రోఫీ పర్యటనను రద్దు చేసింది. టూర్ లో భాగంగా పాకిస్థాన్  క్రికెట్ బోర్డు స్కర్డు, ముర్రీ, హుంజా, ముజఫరాబాద్ నగరాలు ప్రకటించిన కొద్దిసేపటికే  ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, తీవ్రవాదం, కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా జరిగే ఏ క్రికెట్ మ్యాచుల్లోనూ పాల్గొనటం లేదు ఇండియా జట్టు.

ALSO READ | ENG vs NZ: 16 ఏళ్ళ కెరీర్‌కు గుడ్ బై: టెస్ట్ క్రికెట్‌కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ రిటైర్మెంట్

2023లో ఆసియా కప్ ను సైతం బహిష్కరించింది టీమిండియా. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే ఉంటుందని.. మార్పు ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. 2008లో చివరి సారిగా పాకిస్తాన్ దేశంలో టీమిండియా ఆసియా కప్ లో పాల్గొన్నది. ఆ తర్వాత నుంచి అంటే.. ఈ 14 ఏళ్లల్లో ఎప్పుడూ పాక్ వెళ్లలేదు టీమిండియా. తటస్త వేదికపై మాత్రం పాకిస్తాన్ తో తలపడుతుంది. షెడ్యూల్ ప్రకారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ టోర్నీ షెడ్యూల్‌ను వెల్లడించలేదు. అసలు ఈ మెగా టోర్నీ పాకిస్థాన్ లో జరుగుతుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకపోతే ట్రోఫీ దక్షిణాఫ్రికా వేదికగా జరిపేందుకు ఐసీసీ సన్నాహకాలు చేస్తున్నట్టు సమాచారం.