టీనా దాబి, అథర్ ఆమిర్ ఖాన్.. ఇద్దరూ ఐఏఎస్ టాపర్లు. 2015లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (USC) సివిల్స్ పరీక్షలో టీనా టాపర్ అయితే.. అథర్ రెండో ర్యాంకర్. మతాలు వేరైతేనేం.. వారిద్దరు ప్రేమించుకున్నారు. 2018లో మతాంతర వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారనుకుంటున్న సమయంలోనే.. ఏమైందో ఏమోగానీ..రెండేళ్లకే జైపూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. ఇప్పుడు కోర్టు ఆ దంపతులకు విడాకులను మంజూరు చేసింది.
శ్రీరామ్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేసిన టీనా దాబి.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ను సాధించిన తొలి దళిత మహిళగా రికార్డు సృష్టించారు. శిక్షణ సమయంలో అథర్ ఖాన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి 2018 ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. ఆ వేడుకకు ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే.. వారిద్దరి పెళ్లిపై అప్పుడు వివాదం చెలరేగింది. 'లవ్ జిహాద్' అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. వాటిని తాను పట్టించుకోనని, తమది మతాలకు అతీతమైన పెళ్లి అని ఆనాడు టీనా చెప్పుకొచ్చారు.
అయితే వీరి దాంపత్య జీవితి సాఫీగా సాగుతోందని అందరూ భావించారు కాని..2020 నవంబర్ లో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారని వారి కుటుంబాలు చెబుతున్నాయి. రాజస్థాన్ కేడర్ కు చెందిన వారిద్దరూ ఇన్నాళ్లూ అక్కడే విధులు నిర్వర్తించారు. విడాకుల క్రమంలో కశ్మీర్ కు చెందిన అథర్ ను అక్కడికే డిప్యూటేషన్ పై పంపించారు. టీనా ప్రస్తుతం శ్రీనగర్ లో డ్యూటీ చేస్తున్నారు.
