డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను: అన్నామలై శపథం

కోయంబత్తూర్: డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోనని బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై శపథం చేశారు. రాష్ట్రంలో డీఎంకే అరాచక పాలన చేస్తోందని, అందుకు నిరసనగా 48 రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇటీవల అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి ఆయన గురువారం కోయంబత్తూర్‎లో మీడియాతో మాట్లాడారు. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలితో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. బాధితురాలు, ఆమె ఫ్యామిలీ ఇబ్బంది పడేలా ఎఫ్ఐఆర్‎ను లీక్​చేశారని ఫైరయ్యారు. 

విద్యార్థిని వేధించిన వ్యక్తి జ్ఞానశేఖరన్..  డీఎంకే  కార్యకర్త అని, అతను డీఎంకే నేతలతో దిగిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అందుకే  పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. “డీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు నేను చెప్పులు లేకుండా నడుస్తా. డీఎంకే లాగా మేం ఎన్నికల్లో డబ్బులు పంచం. ప్రజల సమస్యలపైనే పోరాడుతాం. ప్రజలు వాస్తవాలను గ్రహించాలి” అని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో చెడు అంతమై పోవాలని కోరుతూ తన నివాసంలో శుక్రవారం ఆరు కొరడా దెబ్బలు కొట్టుకొని మునుగన్‎కు మొక్కు చెల్లించుకుంటానన్నారు.