IND vs NZ: సిరీస్‌ పోయినందుకు బాధగా ఉంది.. ఓటములకు నాదే బాధ్యత: రోహిత్ శర్మ

స్వదేశంలో రారాజులా బ్రతుకుతోన్న టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదురైన విషయం విదితమే. సొంతగడ్డపై పులుల్లా చెలరేగి ఆడే భారత ఆటగాళ్లు.. కివీస్ జోరు ముందు నిలబడలేకపోయారు. ఏ స్పిన్ వ్యూహంతో అయితే న్యూజిలాండ్‌ను మట్టికరిపించాలనుకున్నారో.. అదే వ్యూహానికి మనోళ్లు బలై పోయారు. 

బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో 46 పరుగులకే ఆలౌటైన టీమిండియా.. తదుపరి రెండు రెండుటెస్టుల్లోనూ తడబడుతూనే ఆడింది. అదే వైట్ వాష్‌కు దారితీసింది. ఈ ఓటములపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ నోరు విప్పాడు.

ముంబై టెస్ట్ అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రోహిత్.. కెప్టెన్‌గా ఓటములకు తనదే బాధ్యతని వెల్లడించాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయానని తెలిపాడు. సిరీస్ క్లీన్ స్వీప్ అయినందుకు బాధగా ఉందని అన్నాడు.

Also Read :- సొంత‌గ‌డ్డ‌పై క్లీన్‌స్వీప్.. చేజారిన అగ్ర‌స్థానం

" గెలుపన్నదే లేకుండా టెస్ట్ సిరీస్‌ కోల్పోవడం బాధాకర విషయం. జీర్ణించుకోలేకపోతున్నా. మేము అత్యుత్తమ క్రికెట్ ఆడలేదు.. తప్పును అంగీకరించాలి. జట్టుగా అందరం విఫలమయ్యాం. మా కంటే న్యూజిలాండ్ ఎంతో బాగా ఆడింది. మేం బెంగుళూరు, పూణే టెస్టుల్లో తగినన్ని పరుగులు చేయలేదు. వెనుకబడి పోయాం. కానీ ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగుల ఆధిక్యం సాధించాం. మ్యాచ్‌లో మాదే పైచేయి, కానీ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమయ్యాం. ఇది మనస్సు నొప్పిస్తోంది.."
 
''గత మూడు నాలుగేళ్లుగా ఇలాంటి పిచ్‌లపై ఆడుతున్నాం. ఇక్కడ ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. కానీ ఈ సిరీస్‌లో అలా జరగలేదు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రెండు విభాగాల్లోనూ నేను అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయా.. సమిష్టిగా రాణించకపోవడమే ఈ కూటములకు కారణం..'' అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

గెలిచే మ్యాచ్‌లో ఓటమి..

వాంఖడే వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో టీమిండియాకు విజయావకాశాలు ఉన్నప్పటికీ, చేజేతులా చేజార్చుకున్నారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 121 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా, 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రిషభ్ పంత్ (64) ఒంటరి పోరాటం చేయగా.. ఇతర బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6, గ్లెన్ ఫిలిప్స్ 3, మ్యాట్ హెన్రీ ఒక వికెట్ తీసుకున్నారు.

తదుపరి టీమిండియా ఇదే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.