- నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు కామెంట్
- ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలపై కౌంటర్
కాళ్లావేళ్లా పడి బతిమాలిడి తేనే తాను వైసీపీలోకి వచ్చానని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సోమవారం అన్నారు. నరసాపురం సీటు టీడీపీకి కంచుకోట అని, రాష్ట్రమంతా గెలిచినా అలాంటి చోట ఎలాగైనా గెలవాలని తనను కోరితేనే పార్టీలోకి వచ్చానని చెప్పారు. మంచిదో చెడ్డదో నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు. సీఎం జగన్ దయతో ఎంపీ, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయ్యానన్న నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు కామెంట్లను ఆయన ఖండించారు. మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ప్రసాదరాజు ఈ కామెంట్ చేశారని ఆరోపించారు. ఆయనతో ఎవరు మాట్లాడించారో తనకు తెలుసన్నారు. జిల్లాలో ప్రతిపక్షాలకు చెందిన వాళ్లు భారీ మెజార్టీతో గెలిస్తే.. అధికార పార్టీ నేతలు బార్డర్ లో గట్టెక్కారని గుర్తు చేశారు. ఆయన బొమ్మ చూపించి నెగ్గే పరిస్థితి లేదని జగన్ ను ఉద్దేశించి అన్నారు. జగన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘు రామకృష్ణంరాజు చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దయ వల్ల ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెప్పడం బాధాకరమన్నారు. ప్రసాద్ రాజు కామెంట్స్ కు ఎంపీ కౌంటర్ ఇచ్చారు.

