నాకు ఇల్లు లేకున్నా 4 కోట్ల మందికి కట్టిచ్చిన: మోదీ

  • గత పదేండ్లలో తీవ్ర సంక్షోభంలోకి క్యాపిటల్ సిటీ
  • ఢిల్లీకి ఆప్ విపత్తులాంటిదని విమర్శించిన ప్రధాని
  • అసలైన విపత్తు బీజేపీనే అని కేజ్రీవాల్ కౌంటర్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఆప్ అనే విపత్తు చుట్టుముట్టిందని ప్రధాని మోదీ విమర్శించారు. అది గత పదేండ్లలో ఢిల్లీని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. మళ్లీ ఆప్ ను గెలిపిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అశోక్ విహార్​లో స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన 1,675 ఫ్లాట్లను లబ్ధిదారులకు అందజేశారు. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆప్ సర్కార్​పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. ఎడ్యుకేషన్, లిక్కర్, ఆఖరికి కాలుష్య నియంత్రణలోనూ కరప్షన్ చేసిందని ఫైర్ అయ్యారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ ఒక విపత్తు లాంటిది. ఇది పదేండ్లుగా ఢిల్లీని చుట్టుముట్టింది. సిటీని సంక్షోభంలోకి నెట్టింది. దాన్ని మళ్లీ గెలిపిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఈ విపత్తు(ఆప్)పై ఢిల్లీ ప్రజలు యుద్ధం ప్రకటించారు. దాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు” అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పేదలకు 4 కోట్ల ఇండ్లు.. 

ఢిల్లీ సీఎం అధికారిక నివాసం ‘శీష్ మహల్’ను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్​లాగా తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని అన్నారు. ‘‘నేను నాకోసం ఇల్లు కట్టుకోలేదని దేశం మొత్తానికి తెలుసు. నేను అనుకుంటే అద్దాల మేడ కట్టుకోవచ్చు. కానీ పేదలకు పక్కా ఇండ్లు కట్టివ్వడమే నా లక్ష్యం. ఇప్పటి వరకు 4 కోట్ల ఇండ్లను నిర్మించాను. పేదల కలలను సాకారం చేశాను” అని పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన ‘శీష్ మహల్’కు రూ.వేల కోట్లు ఖర్చు చేసినట్టు విమర్శలు ఉన్నాయి.

ఆయన వేసుకునే సూట్​ ఖరీదే 10 లక్షలు.. మోదీకి కేజ్రీవాల్​ కౌంటర్​

ఢిల్లీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. రూ.10 లక్షల సూట్ ధరించే వ్యక్తి శీష్ మహల్(అద్ధాల మేడ) గురించి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "తన కోసం రూ.2,700 కోట్ల విలువైన ఇల్లు కట్టుకునేవాడు, రూ.8,400 కోట్ల విలువైన ఫ్లైట్​లో ప్రయాణించేవాడు, రూ.10 లక్షల సూట్ వేసుకునే వాడు ‘శీష్ మహల్’ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఆయన స్థాయికి తగదు. నేనెప్పుడూ వ్యక్తిగత ఆరోపణలు చేయను. కక్షసాధింపు రాజకీయాలు చేయను" అని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఢిల్లీ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేసిందేమీలేదని విమర్శించారు. చెప్పుకోవడానికి చేసిన పనులేమీ లేకనే తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. గత ఐదేండ్లలో కేంద్రం కట్టిన ఇండ్లు 4,700 మాత్రమే, పేదలకు సరైన సౌలతులు కల్పించకుండా స్లమ్స్​లోని ఇండ్లను కూల్చివేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు.