న్యూఢిల్లీ: ప్రధాని మోడీ సహా ఎవరికీ తాను భయపడబోనని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల సమస్యలపై తీసుకొచ్చిన ‘ఖేతీ కా ఖూన్’ అనే పుస్తకాన్ని రాహుల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ప్రధానికి సన్నిహితులుగా ఉన్న ముగ్గురు, నలుగురు వ్యక్తులకు మాత్రమే ఈ దేశం అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోందన్నారు. దేశంలో పెద్ద వ్యాపారం వ్యవసాయమేనని, 60 శాతం మంది ప్రజలు అగ్రి రంగం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. భారత వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేసేలా మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం తెచ్చిందని దుయ్యబట్టారు.
‘దేశంలో రైతాంగం, వ్యవసాయ రంగం ప్రమాదంలో పడేలా కొత్త అగ్రి చట్టాలున్నాయి. ఈ చట్టాలు మార్కెట్ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయి. కార్పొరేట్లకు మేలు చేసేలా.. పేద, మధ్య తరగతి ప్రజలకు నష్టం చేసేలా వీటిని రూపొందించారు. వ్యవసాయ రంగాన్ని కొందరు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే రైతులు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రోడ్లపై నిరసనలు కొనసాగిస్తున్నారు. రైతులు వారి కోసం పోరాడటం లేదు. దేశ ప్రజల ఆహారం కోసం ఫైట్ చేస్తున్నారు. అన్నదాతలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందే. నేను మోడీ సహా ఎవరికీ భయపడను. నేను దేశ భక్తుడిని. దేశాన్ని రక్షిస్తా.. రక్షిస్తూనే ఉంటా’ అని రాహుల్ పేర్కొన్నారు.
