మట్టి లేకుండా సాగు.. హైడ్రోపోనిక్స్ తో లాభాలు

హైడ్రోపోనిక్స్ అనేది నేల లేకుండా కేవలం నీటిలో అవసరమైన పోషకాలను జోడించి పంటలు పండించే ఆధునిక వ్యవసాయ విధానం.  ఈ పద్ధతిలో  పంటలకు అవసరమైన పోషకాలు నేరుగా నీటిలో  కలిపి అందిస్తారు. ఈ  సాగు విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  ముఖ్యంగా నగర ప్రాంతాలలో తక్కువ స్థలంలో అధిక దిగుబడి సాధించగలగడం,  నీటి వినియోగం తగ్గించడం,  కలుషితం తగ్గించడం వంటి లాభాలును అందిస్తాయి. హైడ్రోపోనిక్స్ వల్ల లాభాలు చూస్తే,  నీటి వినియోగం తగ్గుతుంది.  సాధారణంగా పంటల సాగులో నీరు చాలా ఎక్కువగా వినియోగిస్తారు. కానీ,  హైడ్రోపోనిక్స్ లో  నీరు మళ్లీ తిరిగి వాడుకోవడం వల్ల 70- నుంచి 90 శాతం వరకు నీటి వినియోగం తగ్గుతుంది. రెండో లాభం తక్కువ స్థలంలో అధిక దిగుబడి వస్తుంది.

పట్టణాల్లో,  నగరాల్లో  స్థలం లేమితో  వ్యవసాయం చేయడం కష్టంగా మారుతోంది . హైడ్రోపోనిక్స్ పద్ధతిలో చాలా తక్కువ స్థలంలో కూడా పంటలను పండించవచ్చు.  హైడ్రోపోనిక్స్పద్ధతిలో  పంటల వృద్ధి వేగంగా జరుగుతుంది.  కాబట్టి, అధిక దిగుబడిని సాధించడం సులభం.  పర్యావరణంపై ప్రభావం లేకుండా సాగు చేయవచ్చు.  నేల అవసరం లేకుండా సాగు చేయడం వల్ల నేల కలుషితం, రసాయనాల వాడకం వంటి సమస్యలు ఎదురవ్వవు.  అలాగే,  రసాయనాలు లేకుండా సేంద్రీయ పద్ధతి  తరహా శుద్ధమైన పంటలను ఉత్పత్తి చేయడం ఈ పద్ధతిలో సులభం.  అదేవిధంగా వర్షాధారిత వ్యవసాయంపై ఆధారపడకపోవడం,  వాతావరణ పరిస్థితులు తగినట్లుగా లేకపోయినా, పంటలు సాగు చేయవచ్చు. ప్రత్యేకించి పట్టణాల్లో, ఇంట్లో లేదా నిర్మాణాల పైకప్పులపై కూడా ఈ విధానం ద్వారా పంటలు పండించవచ్చు. 

ఆహార భద్రతకు సహాయం

హైడ్రోపోనిక్స్ సాగు పద్ధతి  ఆహార భద్రతకు  సహాయపడుతుంది. మెరుగైన పంటల దిగుబడి వల్ల ఆహార భద్రతను మెరుగుపరచవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించగల విధానమైతే అందరూ ఈ పద్ధతిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతారు.  హైదరాబాద్ నగరంలో హైడ్రోపోనిక్స్ పద్ధతిపై శిక్షణ ఇవ్వడంలో అనేక సంస్థలు ఉన్నాయి.  ఈ శిక్షణ కేంద్రాలు కొత్త వ్యవసాయదారులకు,  ఆసక్తి కలిగిన పట్టణవాసులకు హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలు పండించే శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.  తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం  హైడ్రోపోనిక్స్ పై  ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రామాణికంగా శిక్షణ పొందిన ప్రొఫెసర్లు ఈ పద్ధతిని ఎలా అమలు చేయాలో వివరంగా బోధిస్తారు. ఆగ్రో ఎకాడమీ హైదరాబాద్ లోనే  ఉంది. ఈ సంస్థ  హైడ్రోపోనిక్స్ పై  ప్రాక్టికల్ శిక్షణను అందిస్తుంది.  ఇది కొత్త  వ్యవసాయదారులకు,  వ్యాపారాలను  ప్రారంభించాలనుకునేవారికి ఉపకరించే శిక్షణా  కేంద్రంగా విరాజిల్లుతుంది.  ఇక ఎఫ్ఎమ్ఐ (ఫార్మింగ్ మెథడ్స్ ఇన్​స్టిట్యూట్ ) సంస్థ కూడా  హైడ్రోపోనిక్స్ పై శిక్షణ కల్పిస్తుంది. 

ఈ శిక్షణా కేంద్రం  వ్యవసాయ విద్యార్థులకు, పట్టణవాసులకు ఆధునిక వ్యవసాయం పైన అవగాహన కలిగిస్తుంది.  హైదరాబాద్ లో ఉన్న మరో  హైడ్రోగ్రీన్ సంస్థ వ్యక్తిగతంగా  హైడ్రోపోనిక్స్ పై  శిక్షణ ఇవ్వడమే కాకుండా, అవసరమైన సామగ్రి, ఇతర  పరికరాలను కూడా అందిస్తుంది. ఇది ముఖ్యంగా పట్టణ రైతులకు ఉపయోగపడేవిధంగా రూపొందింది.  భవిష్యత్తులో  హైడ్రోపోనిక్స్ ప్రాధాన్యత ఎంతో ఉంది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో భూమి వినియోగం తగ్గించడం, వనరులను సమర్థంగా ఉపయోగించడం వంటి ప్రయోజనాలు ఉన్నందున, ఇది భవిష్యత్తులో శాస్త్రీయ సాగుకు  ప్రధాన మార్గంగా పరిణమించవచ్చు.  నిరంతరం ప్రజల సంఖ్య పెరుగుతున్న తరుణంలో,  పట్టణాల్లో  ఆహార భద్రతను కాపాడేపద్ధతిగా  హైడ్రోపోనిక్స్ పెద్ద పాత్ర పోషిస్తుంది. 

డా.చిట్యాల రవీందర్