ఈ ఇళ్లను హైడ్రా కూల్చదు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోమారు వివరణ ఇచ్చారు. హైడ్రా రాక ముందు (before July 2024) అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024 కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదని చెప్పారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం (ఉదాహరణకు N Convention) ఎప్పుడు కట్టినా FTLలో (Full Tank Level) ఉంటే కూల్చడం జరుగుతుందని తేల్చి చెప్పారు.

గతంలో అనుమతులు ఇచ్చి.. తరువాత వాటిని రద్దు చేస్తే.. ఆ  కట్టడాలు అక్రమ కట్టడాలు అవుతాయని, అవి నివాసాలు అయినా సరే.. జులై తరువాత నిర్మాణం జరుగుతుంటే వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చడం జరుగుతుందని వివరించారు. పేదలను ముందు పెట్టి.. వెనుక నుంచి చక్రం తిప్పుతున్న ల్యాండ్ కబ్జాదారులపై చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. కోర్టు ఉత్తర్వులుంటే ఎలాంటి కట్టడాలైనా కూల్చడం జరుగుతుందని, హైడ్రా ఆవిర్భావం తర్వాత (after జూలై 19 th 2024) అనుమతి ఇచ్చి ఉన్నా, లేకున్నా FTLలో ఉంటే కూల్చడం జరుగుతుందని తెలిపారు.

అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులను చేయటం జరుగతుందని, FTL  పరిధిలో అనుమతి లేకుండా ఉన్న commercial కట్టడాలు (Like N convention , Farm houses/ resorts etc ) ఉన్నా హైడ్రా కూల్చి వేస్తుందని రంగనాథ్ కుండబద్ధలు కొట్టారు. హైదరాబాద్లో చెరువుల FTL మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలుపెట్టిందని, ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.