మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా కూల్చివేతలు..

తెలంగాణలో హైడ్రా అధికారుల దూకుడు ఆగటం లేదు.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపరా కొనసాగుతోంది. శనివారం ( జనవరి 4, 2025 ) మాదాపూర్‌ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్ కూల్చేశారు హైడ్రా అధికారులు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా నిర్మిస్తున్న బిల్డింగ్ ను కూల్చేశారు అధికారులు.

నిబంధనలకు విరుద్ధంగా  సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ తో పాటు 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న క్రమంలో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల మేర‌కు అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్ ను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

అక్ర‌మ క‌ట్ట‌డమ‌ని హైకోర్టు నిర్ధారించినప్పటికీ.. కోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించారు కమిషనర్. హైకోర్టు ఆర్డ‌ర్ ఆధారంగా గతేడాది మార్చ్ లో బిల్డింగ్ కొంతభాగాన్ని కూల్చేశామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు.హైకోర్టు ఉత్తర్వులు పెట్ట్టించుకోకుండా కొనసాగుతున్న ఈ బిల్డింగ్ ను కూల్చేయలని ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ రంగనాథ్.