జనవరి 6 నుంచి హైడ్రా ఆఫీసులో ప్రజావాణి..200 ఎకరాల భూమిని కాపాడినం: రంగనాథ్​

  •  12 చెరువులు, 8 పార్కులు, 4 ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు తొలగించాం
  •  ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడి
  •   హైడ్రా వార్షిక నివేదిక విడుదల

హైదరాబాద్ సిటీ, వెలుగు: కొత్త సంవత్సరం జనవరి 6వ తేదీ నుంచి హైడ్రా ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. శనివారం హైడ్రా ఆఫీసులో వార్షిక నివేదికను ఆయన రిలీజ్ చేశారు. హైడ్రా ఏర్పడిన 5 నెలల పని తీరుతో పాటు వచ్చే ఏడాది కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రా ఆఫీసులో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. హైడ్రా పరిధిలోకి వచ్చే చెరువులు, నాలాలు, పార్కులు తదితర ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా పరిశీలించి చర్యలు తీసుకుందని, కబ్జాల‌‌కు సంబంధించిన పూర్తి వివరాలు, స‌‌ర్వే నంబ‌‌ర్లు, ఫొటోలు ఉంటే జ‌‌త చేసి త‌‌మకు ఫిర్యాదులు చేయాలని సూచించారు.

ఈ ఏడాది జులై 19న హైడ్రా ఏర్పడిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 చెరువులు, 8 పార్కులు, 4 ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించామని, ఈ కూల్చివేతల వల్ల 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామన్నారు. ఈ 12 చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుందన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నమని, ఆ తరువాత హైడ్రాకు సంబంధించిన కేసులు ఆ పోలీస్​స్టేషన్​లోనే నమోదు చేస్తామన్నారు. హైడ్రాకు చైర్మన్‌‌గా సీఎం ఉంటారన్నారు. హైడ్రాతో రియల్ వ్యాపారం తగ్గలేదని లేదని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 

త్వరలో వెదర్​ రాడార్​

త్వరలో వెదర్ రాడార్ రాబోతుందని, హైడ్రా కోసం ఒక ఎఫ్ఎం స్టేషన్ ఏర్పాటు చేస్తామని రంగనాథ్ అన్నారు. సిటీలో ఉన్న వాతావరణ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు ఈ స్టేషన్ ఉపయోగపడుతుందన్నారు. తమ పరిధిలో 1,025 చెరువులను గుర్తించామని పేర్కొన్నారు. చెరువుల హద్దులపై గ్రౌండ్ వర్క్ జరుగుతుందన్నారు. ఓ పక్కన చెరువులను డెవలప్ చేస్తూనే మరోపక్కన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా 15 హైడ్రా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. చెరువులపై సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బందితో పకడ్బందీగా ఫోకస్ పెడుతామన్నారు.

సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజ్ రికార్డులు సేకరించామని, శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా తమ వద్ద ఉందన్నారు. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్ టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నామన్నారు. చెరువులు నింపి ఎఫ్టీఎల్ పరిధి మార్చినా కూడా వాటిని గుర్తించేందుకు పని చేస్తున్నామన్నారు.  హైడ్రా చెరువులు పునరుద్ధరణ చేస్తుందని త్వరలోనే నిరూపిస్తామన్నారు. హైడ్రా ఎవరికీ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వదని, హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,800 కంప్లయింట్స్ వచ్చాయని వాటిపై విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.

వరదలపై అలెర్ట్​గా ఉన్నాం

వరదలపై కూడా హైడ్రా పనిచేస్తుందని, ఈ అంశంపై అలెర్ట్ గా ఉన్నామని రంగనాథ్ అన్నారు. మరోవైపు 72 డీఆర్ఎఫ్ టీమ్‌‌లు అందుబాటులోకి రాబోతున్నాయని, చెట్లు పడిపోవడం, నీళ్లు నిలవడం, ఫైర్ యాక్సిడెంట్లపై డీఆర్ఎఫ్ పని చేస్తుందన్నారు. నగరంలో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుందని, వెదర్ డాటాను విశ్లేషించేందుకు ఒక టీంను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రజలు అలెర్ట్​గా ఉండాలి..

నోటరీ ఉన్న వాటిని కొనేప్పుడు ప్రజలు ఆలోచించాలని, రెండు మూడు రకాలుగా వెరిఫై చేసి కొనాలని రంగనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుమతి లేని నిర్మాణాల్లో బిజినెస్ చేసేవాళ్లు నోటీస్ ఇచ్చిన వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇండ్లు, ప్లాట్స్ కొనే వారి కోసం బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్నాయా లేవా చెప్పేందుకు హైడ్రా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తుందన్నారు. మనం నిలబడిన స్థలం వివరాలు కూడా అందులో తెలిసేలా రూపొందిస్తున్నామన్నారు. జులై 19కు ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదని, పర్మిషన్ లేకుంటే కూల్చివేస్తామని వెల్లడించారు. ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫీయానే హైడ్రాను వ్యతిరేకిస్తున్నదన్నారు. సామాన్యులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదని తేల్చి చెప్పారు.