హైడ్రా ఏర్పడక ముందున్న నిర్మాణాల జోలికెళ్లం: కమిషనర్ రంగనాథ్

  • ఈ రూల్ ​కమర్షియల్​ కట్టడాలకు వర్తించదు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఏర్పడక ముందు ఈ ఏడాది జూలైలోపు కట్టిన అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లబోమని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అయితే, ఈ రూల్​కమర్షియల్​కట్టడాలకు వర్తించదన్నారు. హైడ్రా ఏర్పడిన తర్వాత కట్టిన, కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు.

మూసాపేట, ఖైతలాపూర్ పరిధిలోని కాముని చెరువుతో పాటు మైసమ్మ చెరువును ఆక్రమిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులతో ఆయన మంగళవారం పరిశీలించారు. కాముని చెరువు కబ్జా కాకుండా కాపాడతామన్నారు. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వచ్చే వరద కాల్వ పనులు పూర్తి చేయకుండా వాసవి నిర్మాణ సంస్థ కట్టడాలు చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 మీటర్ల వెడల్పుతో నిర్మించాలనుకున్న వరద కాలువను పూర్తి స్థాయిలో వెంటనే నిర్మించాలని సంస్థకు సూచించారు.