చెరువులను పునరుద్ధరిస్తే వరదలుండవ్ : హైడ్రా చీఫ్ ​రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​చెరువులను పునరుద్ధరిస్తున్నామని, భవిష్యత్​లో వరదలు రావని, ట్రాఫిక్​సమస్యలు తగ్గిపోతాయని హైడ్రా కమిషనర్​ఏవీ రంగనాథ్​చెప్పారు. వరద ముప్పును అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. టెక్నాలజీతో విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులపై హెచ్ఐసీసీ లో మంగళవారం ‘జియో స్మార్ట్ ఇండియా -2024’ పేరుతో సదస్సు జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొని మాట్లాడారు. వానా కాలంలో ముంపు సమస్య పెద్ద సవాల్ గా మారిందని, రెండు సెంటీమీటర్ల వర్షం పడినా ట్రాఫిక్ నిలుస్తోందని చెప్పారు. 

గ్రేటర్ వ్యాప్తంగా కేవలం 0.95 శాతం వర్షపు నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోందన్నారు. చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో వరద కాలనీలను, రహదారులను ముంచెత్తుతోందని తెలిపారు. ఈ క్రమంలో చెరువుల పునరుద్ధరణతోపాటు అనుసంధానంపై ఫోకస్​పెట్టామన్నారు. నాలాల ఆక్రమణలను తొలగిస్తున్నామని, అమీన్ పూర్ చెరువు పరిసరాల్లో ఆక్రమణల తొలగించడంతో వలస పక్షులు వస్తున్నాయని చెప్పారు. 

తూర్పు యూరప్ నుంచి వలస వచ్చిన 12-సెంటీమీటర్ల రెడ్ బ్రెస్టెట్ ఫ్లైక్యాచర్(పక్షి) మనం సరైన మార్గంలోనే వెళ్తున్నామని సూచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి సోషల్​మీడియాలో వెల్లడించారన్నారు. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల సంఖ్య పెంచాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను రంగనాథ్ సందర్శించారు. చెరువులు, పరిరక్షణ,  పునరుద్ధరణ పై హైడ్రా చొరవను జియాస్మార్ట్ ఇండియా సదస్సు అభినందించింది.

హైడ్రాకు రూ.50 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్​శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ మంగళవారం జీఓ జారీ చేశారు. ఈ నిధులను హైడ్రా ఆఫీసు నిర్వహణ, వాహనాల కొనుగోలు, కూల్చివేతల ఖర్చుకు ఉపయోగించనున్నారు. ఇటీవల బడ్జెట్ లో హైడ్రాకు ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.50 కోట్లను రిలీజ్​చేసింది.