- ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది
- 26–40 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్నవారే
- రిస్క్ తీసుకోవాలనుకునే వారు బాగా పెరిగారు
- షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోలు, గోల్డ్ వంటి అసెట్లలో పెరిగిన ఇన్వెస్ట్‌మెంట్లు
- యుగవ్‑మింట్‑సీపీఆర్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్ చేయడం కిందటేడాది బాగా పెరిగిందని ఓ సర్వే పేర్కొంది. స్టాక్ మార్కెట్, బాండ్లు, క్రిప్టో కరెన్సీలు, ఎన్‌ఎఫ్‌టీ వంటి అసెట్లతో పాటు రియల్‌ఎస్టేట్, గోల్డ్ వంటి ఫిజికల్ అసెట్లలో కూడా పట్టణవాసులు బాగా ఇన్వెస్ట్ చేశారని యూగవ్–మింట్–సీపీఆర్ మిలినియల్స్ సర్వే పేర్కొంది. ఈ సర్వే కోసం మొత్తం 206 సిటీలలోని 12,900 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ ఇన్వెస్ట్‌మెంట్లను పెంచుకున్నామని చెప్పారు. 2019 లో ఇలాంటి సర్వేనే చేసినప్పుడు 67 శాతం రెస్పాండెంట్లు ఇన్వెస్ట్ చేశామని చెప్పగా, ఈ సారి 70 శాతం మంది ఇన్వెస్ట్ చేశామని చెప్పారని యుగవ్–మింట్–సీపీఆర్ సర్వే వివరించింది. ఇన్వెస్ట్ చేసే వారు పట్టణాల్లో బాగా పెరిగారని తెలిపింది. ధనవంతులు, యువత తమ ఇన్వెస్ట్‌మెంట్లను పెంచుకున్నారని పేర్కొంది. భారీ లాభాల కోసం రిస్క్ తీసుకోవాలనుకునే వారు పెరిగారని, అందుకే ఇన్వెస్ట్ చేసేవారు ఎగిశారని ఈ సర్వే వివరించింది. ఈ సర్వే ప్రకారం, 52 శాతం మంది రెస్పాండెంట్లు రిస్క్ తీసుకోవాలనుకునేవారే. 13 శాతం మంది రిస్క్ వద్దనుకున్నారు. క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసేవారిని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. 2020 లో 7 శాతం మంది క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేశామని చెబితే, ఈ సారి 17 శాతం మంది ఈ అసెట్‌లో ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. 14 శాతం రెస్పాండెంట్లు డ్రీమ్ 11, ఎంపీఎల్ వంటి ఫాంటసీ గేమింగ్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ చేశారు.
డిపాజిట్లు, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్లకు తగ్గుతున్న ఆదరణ
పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్, బ్యాంక్ సేవింగ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం బాగా తగ్గింది. కానీ, కిందటేడాది ఎక్కువ మంది ఇండ్లలో క్యాష్‌ను పొదుపు చేశారని ఈ సర్వే పేర్కొంది. 2020 లో 22% మంది ఇండ్లలో క్యాష్‌ను పొదుపు చేయగా, 2021 లో ఈ నెంబర్ 30 శాతానికి పెరిగిందని యుగవ్–మింట్–సీపీఆర్ సర్వే వివరించింది. నెలవారీ ఖర్చుల కోసం డబ్బులు బాగా అవసరముండి క్యాష్‌ను సేవ్ చేశామని 75 % మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. యుగవ్–మింట్–సీపీఆర్ చేసిన ఈ సర్వేలో 45% మంది రెస్పాండెంట్ల ఏజ్ 26 నుంచి 41 ఏళ్ల మధ్య ఉంది.
యాప్‌లతో ఈజీగా..
డిజిటల్ యాప్‌లు పెరగడంతో ఇన్వెస్ట్ చేయడం ఈజీగా మారిందని సర్వేలో పాల్గొన్నవారిలో మెజార్టీ మెంబర్లు చెప్పారు. మరోవైపు కిందటేడాది 29 శాతం మంది రెస్పాండెంట్లు తమ ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గాయని చెప్పారు. ఇందులో 42 శాతం మంది తమ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. మిగిలిన వారు ఇన్‌కమ్ తగ్గడమో లేదా ఎకానమీ, మార్కెట్ పరిస్థితులు బాగోకపోవడమో కారణంగా చూపారు. బీఎస్‌ఈ డేటా ప్రకారం, సంక్షోభం టైమ్‌లో యంగర్ ఇన్వెస్టర్లు బాగా పెరిగారు. కానీ, 30–40 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్నవారే ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారని ఈ సర్వే పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఎడ్యుకేషన్, సిటీ, ఏజ్, జెండర్ కంటే ఇన్‌కమ్ కీలకంగా ఉందని వివరించింది. నెలకు కనీసం రూ. లక్ష సంపాదించేవాళ్లు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలిపింది.
ఇన్ఫర్మేషన్ ఎక్కువవ్వడంతో ఇన్వెస్ట్ చేయట్లే..
ఫైనాన్షియల్ అసెట్స్‌కు సంబంధించి పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్‌ను నమ్మడంపై యంగ్ ఇన్వెస్టర్లు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉండడంతో ఇన్వెస్ట్ చేయడంలో 64 శాతం మంది యంగ్ ఇన్వెస్టర్లు ఇబ్బందిపడుతున్నారని డినెరో సర్వే వెల్లడించింది. మొత్తం 500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 51 శాతం మంది రెస్పాండెంట్లు తమ జీతాల్లో కొంత వాటాను పక్కన పెడుతున్నామని చెప్పగా, టెక్నికల్ జార్గాన్, పూర్తిగా తెలియకపోవడం, ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండడం వంటి కారణాలతో నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నామని అన్నారు. 33 శాతం మంది కొంత అమౌంట్‌ను సేవ్ చేస్తున్నామని, కానీ, ఎటువంటి ప్లాన్‌లు లేవని అన్నారు. 40 శాతం మంది షార్ట్ టెర్మ్ ఖర్చుల కోసం సేవ్ చేస్తున్నామని చెప్పారు. ఇలా డబ్బులు సేవ్ చేసేవారిలో 45 శాతం మంది తమ ఖర్చులను ట్రాక్ చేయలేకపోతున్నామని, ఇందుకోసం బ్యాంక్ స్టేట్‌మెంట్లపై ఆధారపడుతున్నామని అన్నారు. 59 శాతం మంది మాత్రం క్రిప్టో కరెన్సీ కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు.
