తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చంపేస్తున్న చలి.. హైదరాబాద్లో పరిస్థితి ఏంటంటే..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత బీభత్సంగా పెరిగింది. చలి, దట్టమైన పొగ మంచుతో పాటు ఈశాన్య గాలులు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. పొగ మంచు, చలి తీవ్రత కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు.

రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, మెదక్, సంగారెడ్డి జిల్లాలో 10 నుంచి 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న క్రమంలో చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్త వహించి ఎండ వచ్చేవరకు బయటకు రాకూడదని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవడంతో పాటు ప్రధాన రహదారులపై దట్టమైన పొగ మంచు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తుంది. నగరవాసులు ఉదయం వేళల వాకింగ్ కు రావాలంటే ఆసక్తి చూపలేని పరిస్థితి నెలకొంది. పొగమంచు కారణంగా గాలిలో తేమ శాతం 078% నమోదు అవుతుండటంతో సూర్యుడు వచ్చిన తర్వాతే వాకింగ్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్యులు సూచిస్తున్నారు.