హైదరాబాద్, వెలుగు : స్పిన్నర్ అనికేత్ రెడ్డి (5/40) ఐదు వికెట్లతో విజృంభించడంతో పుదుచ్చేరితో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యంతో ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇచ్చి గెలుపు ముంగిట నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 24/2తో మూడో రోజు, సోమవారం ఆట కొనసాగించిన పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 153 రన్స్‌కే ఆలౌటైంది. దాంతో హైదరాబాద్‌కు 383 రన్స్ ఆధిక్యం లభించింది.
అజయ్ రోహెరా (27), అరుణ్ కార్తీక్ (20) టాప్ స్కోరర్లు. అనికేత్‌తో పాటు సీవీ మిలింద్, రోహిత్ రాయుడు, తనయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం ఫాలోఆన్‌తో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన పుదుచ్చేరి మూడో రోజు చివరకు 171/2 స్కోరుతో నిలిచింది. ఓపెనర్లు శ్రీధర్ రాజు (61 బ్యాటింగ్), అజయ్ రోహెరా (69) రాణించారు. తనయ్ రెండు వికెట్లు తీశాడు. మరో రోజు ఆట మిగిలున్న మ్యాచ్‌లో హైదరాబాద్ స్కోరుకు పుదుచ్చేరి ఇంకా 212 రన్స్ వెనుకంజలోనే ఉంది.